Pundi : పుండి.. ఇడ్లీ రవ్వతో చేసే ఈ అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. పుండి గురించి అందరికి తెలిసినప్పటికి దీని తయారీ గురించి మనలో చాలా మందికి తెలియదు. పుండిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇడ్లీ రవ్వతో తరచూ ఇడ్లీలే కాకుండా ఇలా పుండిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఉదయం పూట హడావిడి లేకుండా ఉండాలనుకునే వారు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. పుండిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుండి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, రెడ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, ఇడ్లీ రవ్వ – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత.
పుండి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని కళాయికి అంటుకోకుండా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని ముందుగా ఉండలాగా చేసుకోవాలి.
తరువాత వడ లాగా వత్తుకుని మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. ఈ రంధ్రం రెండు వైపులా కాకుండా ఒకవైపు మాత్రమే చేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని ఆవిరి మీద ఉడికించాలి. చిల్లుల గిన్నెను తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత పుండిలను అందులో ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుండిలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.