Kakarakaya Ullikaram : కాకరకాయలు.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. కాకరకాయలు చేదుగా ఉన్నప్పటికి వీటితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కాకరకాయలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ కాకరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో కాకరకాయ ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లిపాయ కారం వేసి కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయలను ఇష్టపడని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారనే చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. చేదు లేకుండా చాలా రుచిగా ఉండేలా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – 4, ఉప్పు – తగినంత, ఉల్లిపాయలు – 3, నూనె – 2 టీ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు -ఒక టీ స్పూన్, కారం – 4 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 8, జీలకర్ర – అర టీ స్పూన్, చింతపండు – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కాకరకాయ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసివేయాలి. తరువాత వీటికి నిలువుగా గాటు పెట్టుకుని లోపల ఉండే గింజలను తీసి వేయాలి. తరువాత వీటిని రెండు ఇంచుల ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి అరగంట పాటు ఈ ముక్కలను పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కాకరకాయ ముక్కలల్లో ఉండే నీటిని పిండేసి మరలా నీటితో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేయించిన కాకరకాయ ముక్కలల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
తరువాత స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలను, మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ ను వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మూత తీసి మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన కాకరకాయ ఉల్లికారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.