Aloo Palak Curry : మనకు ధాబాలలో లభించే రుచికరమైన వంటకాల్లో ఆలూ పాలక్ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది రుచి చూసే ఉంటారు. చపాతీ, రోటీ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని తినడం వల్ల మనం పాలకూర, అలాగే బంగాళాదుంపల్లో ఉండే పోషకాలను పొందవచ్చు. ఈ కర్రీని ధాబా స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ పాలక్ ను ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పాలక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర – 200 గ్రా., నూనె – పావు కప్పు, ఎండుమిర్చి – 5, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – 200 గ్రా., నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
ఆలూ పాలక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీల్లు వేడయ్యాక తరిగిన పాలకూరను వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పాలకూరను తీసి చల్లటి నీటిలో వేసి చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఈ పాలకూరను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి.
తరువాత పాలకూర పేస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకుని కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా నెయ్యి వేసి కలిపి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పాలక్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నం, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఆలూ పాలక్ ను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.