Veg Rolls : వెజ్ చపాతీ రోల్స్.. గోధుమపిండి అలాగే కూరగాయలు కలిపి చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవడానికి ఈ రోల్స్ చాలా చక్కగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు వెజ్ రోల్స్ ను తయారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ వెజ్ చపాతీ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ చపాతీ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు -ఒక టీ స్పూన్, తరిగిన టమాట – 1, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన క్యాప్సికం – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గోధుమపిండి – 2 కప్పులు, టమాట సాస్ – 2 టీ స్పూన్స్.
వెజ్ చపాతీ రోల్స్ తయారీ విధానం..
ముందుగా గోధుమపిండిలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత టమాట, క్యారెట్, బంగాళాదుంప, క్యాప్సికం వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి.
తరువాత దీనిపై నూనె, పొడి పిండి చల్లుకుని మడత పెట్టాలి. ఈ మడత పెట్టిన తరువాత మరలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఈ చపాతీని వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. చపాతీ కొద్దిగా కాలిన తరువాత నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్ని చపాతీలను తయారు చేసుకున్న తరువాత వాటిపై టమాట సాస్ ను రాసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న కూరను మధ్యలో ఉంచి చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ చపాతీ రోల్స్ తయారవుతాయి. వీటిని అల్పాహారంగా అలాగే స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఈ వెజ్ చపాతీ రోల్స్ ను తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు.