Home Made Bread : మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బ్రెడ్ తో రకరకాల చిరుతిళ్లను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా, క్రిస్సీగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సాధారణంగా మనం బ్రెడ్ ను షాపుల నుండి, సూపర్ మార్కెట్ ల నుండి, బేకరీల నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బయట కొనే పని లేకుండా బ్రెడ్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒవెన్ లేకపోయినా కూడా బ్రెడ్ ను మనం తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ ను తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒవెన్ తో పని లేకుండా ఇంట్లోనే బ్రెడ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
వేడి పాలు – 80 ఎమ్ ఎల్, పంచదార – 2 టీ స్పూన్స్, డ్రై ఈస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, మైదాపిండి – పావు కిలో, మిల్క్ పౌడర్ – పావు కప్పు, ఉప్పు – ఒక టీ స్పూన్.
బ్రెడ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలు, పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత ఈస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇందులోనే మైదాపిండి, పాలపొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. తరువాత నూనె వేసుకుంటూ చేతులకు అంటుకోకుండా కలుపుకోవాలి. దీనిని ఇలా 4 నుండి 5 నిమిషాల పాటు కలిపిన తరువాత మూత పెట్టి గంటన్నర పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా చేత్తో వెడల్పుగా వత్తుకోవాలి. తరువాత రోల్ చేసి పొడవుగా ఉండే బేకింగ్ ట్రేలో ఉంచాలి. పిండి ట్రే అంతా వచ్చేలా చక్కగా సర్దుకోవాలి.
తరువాత దీనిపై మూత పెట్టి మరో గంట పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు దీనిపై కాచి చల్లార్చిన పాలను బ్రష్ తో రాసుకోవాలి. ఇప్పుడు పెద్దగా ఉండే గిన్నెలో ఒక కప్పు ఉప్పు లేదా ఇసుకను వేసుకోవాలి. అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత బ్రెడ్ ట్రేను అందులో ఉంచి మూత పెట్టి మధ్యస్థ మంటపై 30 నుండి 35 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రేను బయటకు తీసి కొద్దిగాచల్లారనివ్వాలి. తరువాత అంచులను ట్రే నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత మనకు కావల్సిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ తయారవుతుంది. బయట కొనే పనిలేకుండా ఇలా ఇంట్లోనే సులభంగా బ్రెడ్ ను తయారు చేసుకుని తినవచ్చు.