Vada Podi : మనం ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వాటిలో వడలు కూడా ఒకటి. మినపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే వడలను తయారు చేసుకోవడానికి గానూ మనం పప్పును నానబెట్టి పిండి రుబ్బి వడలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్కువ సమయంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. అయితే కింద చెప్పిన విధంగా వడ పొడిని తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం అరగంటలోనే ఎంతో రుచికరమైన వడలను తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారికి ఈ వడ పొడి ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. వడ పొడితో చేసే ఈ వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇన్ స్టాంట్ వడ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ వడ పొడితో వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వడపొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు -పావుకిలో, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీస్ ఫ్రైకు సరిపడా.
వడపొడి తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో ఈ మినపప్పును వేసి 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. మినపప్పు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండి చల్లారిన తరువాత దీనిని గాలి తగలకుండా డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండి 3 నుండి 4 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో అర కప్పు వడపిండిని తీసుకుని అందులో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ వడ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి.
పిండి చక్కగా నానిన తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని పోసి కలపాలి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి తడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వడలు తయారవుతాయి. ఈ వడలను చట్నీ, సాంబార్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా అప్పటికప్పుడు ఎంతో రుచికరమైన వడలను తయారు చేసుకుని తినవచ్చు.