Ravva Tikki : మనం బొంబాయిరవ్వతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో తయారు చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సులభంగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. తరుచూ చేసే వంటకాలతో పాటు రవ్వతో మనం ఎంతో రుచిగా ఉండే టిక్కీలను కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా రవ్వతో చేసే ఈ టిక్కీలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా కూడా వీటిని తీసుకోవచ్చు. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ రవ్వ టిక్కీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ టిక్కి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన ఉల్లిపాయ – 1, సొట్టు తీసిన బంగాళాదుంప – 1, నీళ్లు – 2 కప్పులు, రెడ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, రవ్వ – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రవ్వ టిక్కి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి చిన్న మంటపై వేయించాలి. ఇవి వేగే లోపు బంగాళాదుంపను తురుముకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత బంగాళాదుంప తురుమును వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే రెడ్ చిల్లీ ప్లేక్స్, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత దగ్గర పడే వరకు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ రవ్వ మిశ్రమం చల్లారిన తరువాత చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ పగుళ్లు లేకుండా టిక్కీల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో 3 టీ స్పూన్ల నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత రవ్వ టిక్కీలను వేసి వేయించాలి. ఈ టిక్కీలను అటూ ఇటూ తిప్పుడూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ టిక్కీలు తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన రవ్వ టిక్కీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.