Surya Kala : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో సూర్యకళ స్వీట్స్ కూడా ఒకటి. ఈ స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది వీటిని మనం ఇంట్లో తయారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చక్కటి రుచికరమైన సూర్యకళ స్వీట్స్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పండుగలకు, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే సూర్యకళ స్వీట్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. బయట స్వీట్ షాపుల్లో లభించే ఈ సూర్యకళ స్వీట్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యకళ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – లీటర్నర, పంచదార – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 కప్పులు, ఉప్పు – చిటికెడు,వంటసోడా – 2 చిటికెలు, నెయ్యి – పావు కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నిమ్మరసం- పావు చెక్క, ఫుడ్ కలర్ – 2 చుక్కలు, చిన్న పలుకులుగా తరిగి వేయించిన జీడిపప్పు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సూర్యకళ స్వీట్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ఈ నీటిని పారబోసి అందులో పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలను కలుపుతూ దగ్గర పడే వరకు మరిగించాలి. ఇలా అరగంట పాటు మరిగించిన తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత మరంత దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత నెయ్యివేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుని వత్తుతూ పిండిని చక్కగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో రెండు కప్పుల పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. దీనిని జిడ్డుగా అయ్యే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడి, కలర్, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు చల్లారిన కోవాలో వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క ఉండను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. అయితే ఇది చపాతీ కంటే కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి. తరువాత అంచు పదునుగా ఉండే గిన్నెతో గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న గుండ్రటి ముక్కను తీసుకుని దానిపై కోవా మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత అంచులపై నీటితో తడి చేయాలి. ఇప్పుడు దానిపై గుండ్రంగా కట్ చేసుకున్న మరో ముక్కను ఉంచి అంచులను గట్టిగా వత్తుకోవాలి. తరువాత సూర్య కిరణాల మాదిరి కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకోవడం రాని వారు ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవచ్చు. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న స్వీట్ లను వేసుకోవాలి. వీటిని చిన్న మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. వీటిని కాల్చుకోవడానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. ఇలా కాల్చుకున్న తరువాత వీటిని వెంటనే పాకంలో వేసుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు పాకంలో ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సూర్యకళస్వీట్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.