Srirangam Sambara Dosa : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే శ్రీరంగం దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది. తమిళనాడులో ఫేమస్ అయిన ఈ శ్రీరంగం దోశను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తరుచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇతర దోశ వెరైటీల వలె దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ శ్రీరంగం దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరంగం సాంబార్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినుములు – ఒక కప్పు, బియ్యం – 2 కప్పులు, ఉప్పు – తగినంత, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు – పావు టీ స్పూన్, శొంఠి పొడి – పావు టీ స్పూన్.
శ్రీరంగం సాంబార్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పొట్టు మినపప్పును తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత మనకు కావల్సిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోతగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత కరివేపాకు, ఉప్పు, మిరియాల పొడి, శొంఠి పొడి వేసి కలపాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శ్రీరంగం దోశ తయారవుతుంది. దీనిని చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా ఈ పిండిని పులియబెట్టే పని లేకుండా పిండి పట్టిన వెంటనే కూడా దోశలుగా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన శ్రీరంగం దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.