Kalakand Payasam : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో కలాకంద్ కూడా ఒకటి. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే కలాకంద్ ను నేరుగా తినడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కలాకంద్ తో పాయసమా అని ఆలోచిస్తున్నారా… అవును కలాకంద్ తో కూడా మనం రుచికరమైన పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, కమ్మగా ఉంటుంది. ఈ పాయసం రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. రుచిగా ఉండే కలాకంద్ తో మరింత రుచిగా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కలాకంద్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అర కప్పు, పెసరపప్పు – అర కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, పాలు – అర కప్పు, జీడిపప్పు – 8, బాదంపప్పు – 5, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, కలాకంద్ – 3, కండెన్డ్స్ మిల్క్ – 400 ఎమ్ ఎల్.
కలాకంద్ పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని, పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. అలాగే ఒక గిన్నెలో పాలను తీసుకుని అందులో బాదంపప్పు, జీడిపప్పు, గసగసాలు వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నానబెట్టిన జీడిపప్పులను పాలతో సహా జార్ లో పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసి చిన్న మంటపై మెత్తగా కలుపుకోవాలి. తరువాత పేస్ట్ చేసుకున్న జీడిప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి.
దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కలాకంద్ ను ముక్కలుగా చేసి వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కండెన్డ్స్ మిల్క్ వేసి మరలా కలుపుకోవాలి. దీనిని మరో 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించి పైన మరో కలాకంద్ ను ముక్కలుగా చేసి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కలాకంద్ పాయసం తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో కండెన్డ్స్ మిల్క్ కు బదులుగా ఒక కప్పు పంచదారను కూడా వేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం పాయసం కాకుండా వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.