Mulakkada Masala Curry : మనం ములక్కాడలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాడలతో సాంబార్, కూర, ఇగురు వంటి వాటితో పాటు ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. మునక్కాడలతో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు, వంటరాని వారు కూడా చాలా తేలికగా ఈ మసాలా కర్రీని తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మునక్కాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ములక్కాడ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, టమాట – పెద్దది ఒకటి, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన మునక్కాయలు – 2, నీళ్లు – 150 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర- కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, గసగసాలు -ఒక టీ స్పూన్, చింతపండు -ఒక రెమ్మ.
ములక్కాడ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత చింతపండు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే చింతపండు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసివేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత దంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాటాను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత మునక్కాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత నీళ్లు పోసికలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మునక్యా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కూర చక్కగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పులావ్, బిర్యానీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.