Katta Moong Curry : మనం పెసర్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మనం ఎక్కువగా పెసరట్లు, గుగ్గిళ్లు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇవే కాకుండా ఈ పెసర్లతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పెసర్లతో చేసే కట్టా మూంగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. గుజరాతీ వంటకమైన ఈ కట్టా మూంగ్ కర్రీ పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ కర్రీని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ కట్టా మూంగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కట్టా మూంగ్ కర్రీ తయారీ విధానం..
పెసర్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పెరుగు – ఒకటిన్నర కప్పు, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, లవంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం తరుగు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె లేదా నెయ్యి – 2 టీ స్పూన్స్.
కట్టా మూంగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా పెసర్లను శుభ్రంగా కడిగి నానబెట్టాలి. తరువాత వీటిని కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, అల్లం తరుగు వేసి వేయించాలి.
తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు మిశ్రమం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉడికించిన పెసర్లు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కట్టా మూంగ్ కర్రీ తయారవుతుంది. దీనిని జీరా రైస్, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పెసర్లతో చేసిన ఈ కర్రీని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.