Wake Up Early : మారిన మన జీవన విధానం కారణంగా అలాగే ఉద్యోగరీత్యా మనలో చాలా మంది ఆలస్యంగా నిద్రిస్తున్నారు. దీంతో వారు ఆలస్యంగా మేల్కొంటున్నారు. పూర్వకాలంలో త్వరగా నిద్రించి ఉదయం 4 లేదా 5 గంటల లోపే నిద్రలేచి వారి పనులు వారు చేసుకునే వారు. కానీ నేటి తరుణంలో చాలా మంది రాత్రి 11 నుండి 12 వరకు మేల్కొని ఉండి ఆలస్యంగా నిద్రపోతున్నారు. అలాగే చాలా మంది నిద్రలేమి కారణంగా రాత్రి ఎప్పటికో నిద్రిస్తున్నారు. దీంతో ఉదయం పూట అలస్యంగా మేల్కొంటున్నారు. అయితే ఉదయం పూట ఆలస్యంగా మేల్కొనడం వల్ల మనకు నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదని అదే త్వరగా నిద్రించి త్వరగా మేల్కొనడం వల్ల మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం పూట త్వరగా లేవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలిస్తే అందరూ ఉదయం త్వరగా మేల్కొంటారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయం పూట మనం ఎందుకు త్వరగా లేవాలి… ఉదయం పూట త్వరగా మేల్కొనడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం త్వరగా మేల్కొవడం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఉదయం త్వరగా లేవడం వల్ల మన జీవితంలో అభివృద్ది ఉంటుంది. మనం విజయం వైపు అడుగులు వేయగలుగుతాము. మన ఆలోచనా విధానం మారుతుంది. మనం మరింత తెలివిగా ఆలోచించగలుగుతాము. మనం పని చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది.
అదే విధంగా ఉదయం పూట త్వరగా లేవడం వల్ల మనం చక్కటి అల్పాహారాన్ని తీసుకోగలుగుతాము. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాము. అలాగే త్వరగా మేల్కొవడం వల్ల శరీరానికి తగినంత నిద్ర లభిస్తుంది. అలసట దరి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఉదయం త్వరగా లేవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి మన దరి చేరకుండా ఉంటుంది. ఉదయం పూట త్వరగా లేవడం వల్ల మనం పని చేసే చోటుకు త్వరగా చేరుకోగలుగుతాము. దీంతో ట్రాఫిక్ బాదలు కూడా ఉండవు. అలాగే ఉదయం పూట త్వరగా లేవడం వల్ల మనం వ్యాయామం చేయడానికి తగినంత సమయం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవగలుగుతాము. ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేవడం వల్ల చర్మ ఆరోగ్యం, అందం దెబ్బతింటుంది.
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మొటిమలు, చర్మంపై గీతలు, ముడతలు వంటి సమస్యలు తలెత్తుతాయి. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరుతాయి. అదే మనం త్వరగా నిద్రించి త్వరగా మేల్కొనడం వల్ల ఇటువంటి చర్మ సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. కనుక మనం రోజూ రాత్రి త్వరగా నిద్రించి ఉదయాన్నే త్వరగా మేల్కొనాలి. త్వరగా మేల్కొనడం వల్ల ఇలా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే మనం ఖచ్చితంగా ఉదయం పూట త్వరగా మేల్కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యంగా నిద్ర లేచే వారు ఇప్పటికైనా ఈ అలవాటును మార్చుకోవాలని లేదంటే అనేక అనారోగ్య సమస్యలను ఆహ్వనించినట్టేనని వారు తెలియజేస్తున్నారు.