Mulakkada Ulligadda Karam : మనక్కాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మునక్కాయల వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. మునక్కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. సాంబార్, పప్పు చారు వంటి వాటిలో వేయడంతో పాటు మునక్కాయలతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలతో వండే వంటకాల్లో మునక్కాయ ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లిగడ్డకారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కలర్ ఫుల్ గా ఉండే ఈ మునక్కాడ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాడ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు- అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన మునక్కాయ- 1, తరిగిన టమాటాలు – 2, పసుపు – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – ఒక రెమ్మ.
ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, తరిగిన ఉల్లిపాయలు – 2, వెల్లుల్లి రెమ్మలు – 10.
మునక్కాడ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా ఉల్లికారం తయారు చేసుకోవడానికి ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో మరలా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మునక్కాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత మునక్కాయ ముక్కలు ఉడకడానికి సరిపడా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. నీరంతా ఇగిరి పోయి ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం, చింతపండు గుజ్జు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాడ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మునక్కాయ ఉల్లికారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.