Dragon Fruit : మనం ఆహారంగా తీసుకోదగిన రుచికరమైన పండ్లల్లో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఒకటి. ఒక్కప్పుడు ఈ పండ్లను విదేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ పండ్లు మనకు ఎక్కడపడితే అక్కడ విరివిగా లభిస్తున్నాయి. ఈ పండ్లు లోపలి భాగం తెలుపు మరియు పింక్ రంగుల్లో రెండు రకాలుగా లభిస్తాయి. సలాడ్ రూపంలో, జ్యూస్ రూపంలో లేదా నేరుగా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇతర పండ్ల వలె డ్రాగన్ ఫ్రూట్స్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ లో ఐరన్, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. డ్రాగన్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. పొట్టలో ఉండే బ్యాక్టీరియాను, వైరస్ లను నశింపజేయడంలో ఈ పండ్లు మనకు దోహదపడతాయి. అలాగే ఈ పండ్లల్లో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ ను మన శరీరం ఎక్కువగా గ్రహించేలా చేయడంలో కూడా ఈ ఐరన్ ఉపయోగపడుతుంది.
ఈ పండ్లను తీసుకోవడం వల్ల మన అందం కూడా మెరుగుపడుతుంది. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ మనకు సహాయపడతాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా డ్రాగన్ ఫ్రూట్స్ తోడ్పడతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కనుక వీటిని కూడా అందరూ తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.