Biyyam Pindi Chegodilu : మనం బియ్యంపిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన పిండి వంటకాల్లో చెకోడీలు కూడా ఒకటి. చెకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బయట స్వీట్ షాపుల్లో, సూపర్ మార్కెట్ లో ఈ చెకోడీలు మనకు సులభఃగా లభిస్తాయి. అయితే బయట కొనే పనిలేకుండా రుచిగా, గుల్ల గుల్లగా, క్రిస్పీగా ఉండే ఈ చెకోడీలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువగా సమయం కూడా పట్టదు. రుచిగా, క్రిస్పీగా ఉండే చెకోడీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యంపిండి చెకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యపిండి – ఒక కప్పు, ఉప్మా రవ్వ – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, వేడి నూనె లేదా బటర్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బియ్యంపిండి చెకోడీల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, వాము, నువ్వులు, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కళాయిలో నీళ్లు, బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగి నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత బియ్యంపిండి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ పిండిని గిన్నెలో వేసి చేత్తో కలుపుకోవాలి. నీళ్లు అవసరమైతే కొద్దిగా నీటిని చల్లుకుని పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టాలి. తరువాత పిండిని రోల్ లాగా చేత్తో వత్తుకోవాలి.
తరువాత దీనిని సమానంగా ముక్కలుగా కట్ చేసుకుని చెకోడీలా చుట్టుకుని నూనె రాసిన ప్లేట్ మీద వేసుకుని పక్కకు ఉంచాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చెకోడీలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెకోడీలు తయారవుతాయి. ఈ చెకోడీలు పూర్తిగా చల్లారిన తరువాత గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన చెకోడీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.