రోజుకో యాపిల్ పండును తింటే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదంటారు. అవును.. ఇది నిజమే.. ఎందుకంటే యాపిల్ పండ్లలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. అవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. కనుకనే రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అని చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 7500కు పైగా యాపిల్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక మనకు కూడా భిన్న రకాల యాపిల్ పండ్లు అందుబాటులో ఉన్నాయి. మరి రోజుకో యాపిల్ పండును తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. యాపిల్ పండ్లలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం, నియాసిన్, ఫోలేట్స్, థయామిన్, విటమిన్లు ఎ, సి, ఇ, కె లు ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
2. యాపిల్స్ లో ఫ్లేవనాయిడ్స్, ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. అందువల్ల ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. కణాలు సురక్షితంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
3. యాపిల్ పండ్లను తినడం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది. నీరసంగా, అలసటగా ఉన్నవారు ఈ పండ్లను తింటే శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు.
4. యాపిల్ పండ్లలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది. దీంతో రక్తహీనత సమస్య రాదు. రక్తం బాగా తయారవుతుంది. శరీరంలోని కణాలకు రక్తం బాగా అందుతుంది.
5. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
6. ఆస్తమా సమస్య ఉన్నవారు రోజూ యాపిల్ పండ్లను తింటే ఫలితం ఉంటుంది. యాపిల్ పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ పండ్లలోని ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ రాకుండా చూస్తుంది.
7. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
8. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు రోజూ యాపిల్ పండ్లను తింటే మేలు జరుగుతుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
9. యాపిల్ పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.