Guntur Gongura Pulao : గుంటూరు గోంగూర పులావ్.. గోంగూరతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ పులావ్ ను తయారు చేయడం చాలా సులభం. తరుచూ చికెన్, మటన్ పులావ్ లే కాకుండా ఇలా గోంగూరతో కూడా రుచికరమైన పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా గోంగూరతో కమ్మటి పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో ఈ పులావ్ ను తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా ఈ పులావ్ ను తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ గోంగూర పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటూరు గోంగూర పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, సన్నగా పొడవుగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, బిర్యానీ ఆకులు – 2, అనాస పువ్వులు – 2, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, యాలకులు – 5, మరాఠీ మొగ్గ – 1, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, జీడిపప్పు – 10 నుండి 15, సాజీరా – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – 2 రెమ్మలు, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాటాలు – 3, ఎర్ర గోంగూర – 75 గ్రా., నీళ్లు – 2 కప్పుల కంటే కొద్దిగా తక్కువ, ఉప్పు – తగినంత, గంట పాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – అర కప్పు, తరిగిన పుదీనా – కొద్దిగా.
గుంటూరు గోంగూర పులావ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు, సాజీరా వేసి వేయించాలి తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరుఆత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు సగానికి పైగా మగ్గిన తరువాత గోంగూర వేసి కలపాలి. తరువాతమూత పెట్టి గోంగూరను మెత్తగా మగ్గించాలి. గోంగూర మగ్గిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి.
తరువాత వేయించిన బ్రౌన్ ఆనియన్స్ వేసి మూత పెట్టి 6 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని మరో 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుంటూరు గోంగూర పులావ్ తయారవుతుంది. దీనిని రైతా, మసాలా కూరలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన గుంటూరు గోంగూర పులావ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.