Nellore Style Pappu Charu : మనలో చాలా మంది పప్పుచారుతో తృప్తిగా భోజనం చేస్తారనే చెప్పవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ పప్పుచారును ఇష్టంగా తింటారు. ఈ పప్పుచారును ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్పే విధంగా నెల్లూరు స్టైల్ లో చేసే ఈ పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచిచూస్తే మళ్లీ ఇదే పప్పుచారు కావాలని అడగక మానరు. ఈ పప్పుచారు తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా నెల్లూరు స్టైల్ లో పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెల్లూరు స్టైల్ పప్పు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక టీ గ్లాస్, తరిగిన టమాటాలు – 2, ఎండుమిర్చి – 10, పసుపు – పావు టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – తగినన్ని, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ- 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
నెల్లూరు స్టైల్ పప్పు చారు తయారీ విధానం..
ముందుగా పప్పును కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు, టమాట ముక్కలు, ఎండుమిర్చి, పసుపు, నూనె వేసి మూత పెట్టాలి. ఈ పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో చింతపండు రసం, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న చారులో వేసి కలపాలి. తరువాత ఈ చారును మరలా స్టవ్ మీద ఉంచి మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పప్పుచారు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పప్పుచారును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.