Ullipaya Egg Pulusu : ఉల్లిపాయలను వంటల్లో వాడడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన రుచికరమైరన వంటకాల్లో ఉల్లిపాయ ఎగ్ పులుసు కూడా ఒకటి. ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఉల్లిపాయలతో ఎగ్ పులుసు తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ ఎగ్ పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ ఎగ్ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 4, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – ఉసిరికాయంత, నీళ్లు – అర గ్లాస్, ఉడికించిన కోడిగుడ్లు – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఉల్లిపాయ ఎగ్ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలను మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా మగ్గిన తరువాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసి కలిపి మూత పెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత చింతపండు గుజ్జు కొద్దిగా వేసి కలపాలి.తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత గుడ్లకు గాట్లు పెట్టి వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ గుడ్డు పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.