Swelling In Feet : మనల్ని వేధించే వివిధ రకాల ఆరోగ్య సమస్యల్లో పాదాల వాపు సమస్య కూడా ఒకటి. దీనినే పెరిఫెరల్ ఎడెమా అని అంటారు. అనేక కారణాల చేత పాదాల్లో వాపు వస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం తగ్గదు. చాలా మంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ పాదాల్లో వాపు సమస్యను అన్ని పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. ఎక్కువ సేపు నిలబడి ఉండడం, కూర్చొని ఉండడం వల్ల పాదాల్లో వాపు సహజంగా వస్తుంది కానీ ఈ వాపు ఎక్కువ కాలం పాటు ఉంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మన శరీరంలో ఉండే వివిధ అనారోగ్య సమస్యల వల్ల కూడా పాదాల్లో వాపు వస్తుంది.
మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు, సిరలకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత సమస్యల కారణంగా కూడా పాదాల్లో వాపు వస్తుంది.కనుక పాదాల్లో వాపు ఎక్కువ కాలం పాటు ఉంటే వెంటనే వైద్యున్నిసంప్రదించడం మంచిది. అలాగే పాదాల్లో వాపుతో పాటు ఎర్రగా ఉండడం, నొప్పి, అసౌకర్యంగా ఉండడం వంటి ఇతర సమస్యలు ఉంటే కూడా వైద్యున్ని సంప్రదించడం మంచిది. పాదాల్లో ఇన్ఫెక్షన్, ఇన్ ప్లామేషన్ కారణంగా ఇలా జరుగుతుంది. అలాగే హార్మోన్లల్లో మార్పు, ఉన్నట్టుండి బరువు పెరగడం వంటి కారణాల చేత కూడా పాదాల్లో వాపు వస్తుంది. అదే విధంగా చీల మండలంలో గాయాల కారణంగా కూడా పాదాల్లో వాపు వస్తుంది.
గాయం కారణంగా అసౌకర్యం, శరీర బరువు అంతా పాదాల మీద పడడం వంటి కారణాల చేత పాదాల్లో వాపు వస్తుంది. పాదాల్లో వాపుతో పాటు నొప్పి, తీవ్రమైన అసౌకరర్యం ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. సిరల్లో రక్తం గట్టకట్టడం, కాలేయ సంబంధిత సమస్యల వల్ల ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. పాదాల్లో వాపుతో పాటు జ్వరం, ఎరుపు, పాదాల నుండి వెచ్చగా ఆవిరి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అది సెల్యులైటిస్ కు కారణం కావచ్చు. ఇలా అనేక కారణాల చేత పాదాల్లో వాపు వస్తూ ఉంటుంది. కనుక అన్ని సందర్యాల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పాదాల్లో వాపు ఎక్కువ కాలం పాటు ఉండడం అలాగే వాపుతో పాటు అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.