Punjabi Mutton Masala Gravy : మనకు పంజాబీ ధాబాల్లలో లభించే నాన్ వెజ్ వంటకాల్లో మటన్ గ్రేవీ కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ కర్రీని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎక్కువ గ్రేవీతో , రుచిగా ఉండే ఈ మటన్ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ కర్రీని రుచిగా, తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. పంజాబీ మటన్ గ్రేవీమసాలా కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబీ మటన్ మసాలా గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పెరుగు – 3 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కసూరిమెంతి – అర టీ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
లవంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 5, బిర్యానీ ఆకు – 1, నల్ల యాలక్కాయ – 1, మిరియాలు – 10, ఎండుమిర్చి- 2, తరిగిన ఉల్లిపాయలు – పెద్దవి రెండు, తరిగిన పెద్ద టమాటాలు – 2.
పంజాబీ మటన్ మసాలా గ్రేవీ తయారీ విధానం..
ముందుగా మటన్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత మటన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు పూర్తిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత పెరుగు, మటన్ వేసి కలపాలి.
తరువాత తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు మటన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తరువాత మూత తీసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి అందులో కసూరిమెంతి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ మసాలా గ్రేవీ కర్రీ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.