Headache In Winter : చలికాలంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో తలనొప్పి కూడా ఒకటి. చలికాలంలో తలనొప్పి సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. తలనొప్పి కారణంగా కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. అయితే చలిరకాలంలో తలనొప్పి ఎందుకు ఎక్కువగా వస్తుంది.. అలాగే ఈ సమస్య నుండి బయట పడేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరానికి ఎండ తక్కువగా తగలడం వల్ల కూడా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉంటుందన్న కారణం చేత మనలో చాలా మంది బయటకు రారు. అలాగే ఎండ కూడా చలికాలంలో తక్కువగా ఉంటుంది. దీంతో శరీరానికి ఎండ అంతగా తగలదు. దీని వల్ల శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే శరీరంలో విటమిన్ డి స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో తలనొప్పి వస్తుంది.
ఈ సమస్య నుండి బయటపడాలంటే రోజూ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పుల కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. కనుక చలికాలంలో ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దుస్తులను ధరించాలి. మన శరీరాన్ని వాతావరణనానికి తగినట్టు మార్పు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే చలికాలంలో చాలా మంది నీటిని తక్కువగా తాగుతారు. శరీరంలో నీటి స్థాయిలు తగ్గడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది. కనుక రోజూ గోరు వెచ్చని నీటిని తాగాలి. సూప్ లను, హెర్బల్ టీ లను తాగడం అలవాటు చేసుకోవాలి.
వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలగడంతో పాటు చలి నుండి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా చలికాలంలో చాలా మంది ట్రిప్స్ కు వెళ్తూ ఉంటారు. దీంతో కూడా తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి యోగా, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే చాలా మంది ఇంట్లో వెచ్చగా ఉండడానికి ఇండోర్ హీటర్లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఇంట్లో వెచ్చగా ఉన్నప్పటికి ఇవి గాలిలో తేమను తగ్గిస్తాయి. దీంతో కూడా తలనొప్పి వస్తుంది. కనుక గాలిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా చలికాలంలో తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయని కనుక తలనొప్పికి గల కారణాన్ని తెలుసుకుని జాగ్రత్త తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.