Spicy Aloo Fry : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. మనం మన రుచికి తగినట్టుగా వివిధ రకాలుగా ఆలూ ఫ్రైను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ ఫ్రై పొడి పొడిగా, క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, క్రిస్పీగా ఆలూ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3( మధ్యస్థంగా ఉన్నవి), ధనియాలు- ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందగా బంగాళాదుంపలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నీటిలో వేసి 2 నుండి 3 సార్లు బాగా కడగాలి. తరువాత వీటిని ఉప్పు నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో తిన్నా లేదా పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఆలూ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.