Oil Free Kichdi : దాల్ కిచిడీ.. పెసరపప్పు, బియ్యం కలిపి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అల్పాహారంగా, లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని తయారు చేస్తూ ఉంటారు. ఈ కిచిడీని మనం మరింత రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసేలా నూనె, నెయ్యి వెయ్యకుండా కమ్మగా, రుచిగా కూడా ఈ కిచిడీని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. నూనె లేకుండా రుచిగా,ఆరోగ్యానికి మేలు చేసేలా కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిల్ ఫ్రీ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక గ్లాస్, పెసరపప్పు – అరగ్లాస్, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, మిరియాలు – 6, అనాస పువ్వు – 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 5 లేదా తగినన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన బీన్స్ – 6, తరిగిన క్యారెట్ – 1, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – 3 గ్లాసులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
ఆయిల్ ఫ్రీ కిచిడీ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని, పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో జీలకర్ర, మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా నీళ్లు పోసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరగాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి మాడిపోకుండా కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ వేయించాలి. ముక్కలు మగ్గిన తరువాత ఎండుకొబ్బరి పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి వేయించాలి.
బియ్యంలోని నీరంతా పోయే వరకు బాగా వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి పెద్ద మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కిచిడీ తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కిచిడీని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.