Spicy Boondy Kurma : బూందీ కుర్మా.. బూందీతో చేసే ఈ కుర్మా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఒక్కసారి ఈ కర్రీని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కర్రీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ బూంది కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బూంది కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – అర కప్పు, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, అరగంట పాటు నీటిలో నానబెట్టిన జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, అరగంట పాటు నీటిలో నానబెట్టిన కర్బూజ గింజలు – 2 టటీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పేస్ట్ గా చేసిన పెద్ద ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 750 ఎమ్ ఎల్, గరం మసాలా – ముప్పావు టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్.
బూంది కుర్మా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో శనగపిండి, బియ్యంపిండి వేసుకోవాలి. తరువాత నీళ్లు పోస్తూ గంటె జారుడుగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక బూందీ గంటెలో పిండి వేసి నూనెలో బూందీని వేసుకోవాలి. దీనిని పెద్ద మంటపై రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో నానబెట్టిన జీడిపప్పు, కర్బూజ గింజలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో పావు కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇది వేగిన తరువాత ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి.
దీనిని కలుపుతూ మధ్యస్థ మంటపై రంగు మారే వరకు వేయించాలి. ఇలా 10 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూరను సర్వ్ చేయడానికి 5 నిమిషాల ముందు ముందుగా తయారు చేసుకున్న బూందీ వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బూంది కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బూందీ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.