Soft Masala Chapati : తరుచూ ఒకేరకం చపాతీలు తిని తిని బోర్ కొట్టిందా… అయితే కింద చెప్పిన విధంగా వెరైటీగా మసాలా చపాతీలను తయారు చేసి తీసుకోండి. ఈ మసాలా చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. ఏ కర్రీ లేకపోయినా కూడా వీటిని తినేయవచ్చు. అలాగే ఇవి చాలా సమయం వరకు కూడా గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఈ చపాతీలను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఈ మసాలా చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 5, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 4, గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వాము – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – చిటికెడు, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
మసాలా చపాతీ తయారీ విధానం..
ముందుగా జార్ లో జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, వాము, కొత్తిమీర, పసుపు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత పెరుగు, నూనె వేసి కలపాలి. తరువాత గోరువెచ్చని నీటిని పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకుని ఒక్కో ఉండను తీసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక చపాతీ వేసి కాల్చుకోవాలి. దీనిని బటర్ లేదా నెయ్యితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీని రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా చపాతీ తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా కర్రీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.