Pancreas Cancer Symptoms : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ప్యాంక్రియాస్ గ్రంథి కూడా ఒకటి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో ఈ గ్రంథి చాలా ముఖ్యమైనది. మనం తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి అవసరమయ్యే ఎంజైమ్ లను ఈ గ్రంథి విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్ లు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు వంటి వాటిని విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇన్సులిన్ ను కూడా ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఇలా మన శరీరంలో వివిధ రకాల ముఖ్యమైన విధులను ప్యాంక్రియాస్ గ్రంథి నిర్వర్తిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ లలో ఇది కూడా ఒకటి. ఈ వ్యాధి ముదిరే వరకు కూడా దీనిని గుర్తించలేము. అయితే ఈ వ్యాధి ముదిరే కొద్ది మనలో కొన్ని లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలను గుర్తించడం చాలా అవసరం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడిన తరువాత మనలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడిన వారిలో కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారిపోతాయి. సాధారణంగా దీనిని పచ్చకామెర్లు అనుకుంటారు. కానీ ఇది కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. ప్యాంక్రియాసిస్ లో ఏర్పడిన కణితి పిత్త వాహికను అడ్డుకున్నప్పుడు రక్తప్రవాహంలో బిలిరుబిన్ పేరుకుపోతుంది. దీంతో కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారతాయి. అలాగే నిరంతరం కడుపు నొప్పి, పొత్తి కడుపులో రావడం కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. తిన్నతరువాత, పడుకున్న తరువాత ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్ లో కణితి ఏర్పడడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. దీంతో వివరించలేని వికారం, వాంతులు మరియు బరువు తగ్గడం జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో కనిపించే సాధారణ లక్షణాల్లో ఇవి ఒకటి. అలాగే ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో విరేచనాలు, మలబద్దకం, లేత రంగు మలం రావడం వంటివి కనిపిస్తాయి.
ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే జీర్ణ ఎంజైమ్ లలో వచ్చే అంతరాయం కారణంగా ఇలా జరుగుతుంది. ఇక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడిన వారిలో మధుమేహం అభివృద్ది చెందుతుంది. మధుమేహం లేని వారికి కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ప్యాంక్రియాస్ లో కణితులు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం జరుగుతుంది. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో కనిపించే లక్షణాల్లో రక్తం గడ్డకట్టడం కూడా ఒకటి. ముఖ్యంగా కాళ్లు, ఊపిరితిత్తుల సిరలల్లో రక్తం ఎక్కువగా గడ్డకడుతుంది. అలాగే ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో అజీర్తి, ఉబ్బరంతో పాటు కడుపులో తీవ్ర అసౌకర్యం ఉంటుంది. కణితి కారణంగా ప్యాంక్రియాసిస్ విడుదల చేసే ఎంజైమ్ లల్లో వచ్చే మార్పుల వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఈ క్యాన్సర్ అభివృద్ది చెందుతున్నప్పుడు విపరీతంగా నీరసం, అలసట ఉంటుంది. ఈ విధంగా ఈ లక్షణాలను బట్టి మనం ప్యాంక్రియాస్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు గనుక మీలో కనిపించినట్లయితే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం.