Nuts : అధిక శక్తి, అధిక బలం కలిగి ఉండే ఆహారాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్ నట్స్. వీటిలో విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అల్పాలెనోనిక్ యాసిడ్ వంటి ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, సన్నగా ఉన్న వారు, ఎక్కువగా కష్టపడే వారు, బాడీ బిల్డింగ్ చేసే వారు ఈ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ గింజలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి ఇవి అధిక ధరలతో కూడుకున్నవి. వీటి ధర కిలో 1000 రూ. పైగా ఉంటుంది.వీటిని కొనుగోలు చేసి కుటుంబంలో అందరూ తినలేరు. అలాంటి వారు వీటికి బదులుగా ఇతర గింజలను కూడా తీసుకోవచ్చు.
ఈ గింజలు బాదంపప్పు, జీడిపప్పు అంత శక్తిని, బలాన్ని కలిగి ఉండడంతో పాటు వాటి కంటే చాలా తక్కువ ధరలో లభిస్తాయి. ఇందులో మొదటిది పుచ్చగింజల పప్పు. స్వీట్ లలో, వంటలల్లో ఈ పప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి తక్కువ ధరలో మనకు లభిస్తాయి. అలాగే 100గ్రాముల పుచ్చగింజల పప్పులో 628 క్యాలరీల శక్తి ఉంటుంది. జీడిపప్పు, పిస్తా పప్పు కంటే వీటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పుచ్చగింజల పప్పులో మిగిలిన వాటి కంటే ఎక్కువగా దాదాపు 34 శాతం ప్రోటీన్ ఉంటుంది. మేక మాంసం, కోడి మాంసం కంటే కూడా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కనుక పుచ్చగింజల పప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల ప్రోటీన్, శక్తితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇక రెండవది పొద్దు తిరుగుడు గింజల పప్పు. 100గ్రాముల పొద్దుతిరుగుడు గింజలపప్పులో 556 క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే 18 నుండి 20 శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే వీటిలో ఇతర గింజల కంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. 100గ్రాముల పొద్దుతిరుగుడు గింజలల్లో 35 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.
జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు త్వరగా వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా ఉండాలనుకునే వారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం మంచిది. ఇక మూడవ పప్పు గుమ్మడి గింజల పప్పు. 100గ్రాముల గుమ్మడి గింజలపప్పులో 570 క్యాలరీల శక్తి, 30శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఈ గింజలల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి 7 మైక్రో గ్రాముల జింక్ అవసరమవుతుంది. కానీ గుమ్మడి గింజలల్లో 7.7 నుండి 8 మైక్రోగ్రాముల జింక్ ఉంటుంది. మెదడు చురుకుగా పని చేయడానికి, మేధాశక్తికి, తెలివితేటలు పెరగడానికి జింక్ చాలా అవసరం. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత జింక్ లభిస్తుంది. ఈ విధంగా ఈ మూడు రకాల గింజలను తీసుకోవడం వల్ల చాలా తక్కువ ధరలో మన శరీరానికి కావల్సిన శక్తి, బలం లభించడంతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.