Mouth Cancer Symptoms : నేటి తరుణంలో ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న అనారోగ్య సమస్యలల్లో క్యాన్సర్ ఒకటి. మారిన మన జీవనవిధానం, జన్యుపరమైన కారణాల చేత చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో నోటి క్యాన్సర్ ఒకటి. ధూమపానం, పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి క్యానర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నోటి క్యాన్సర్ కూడా ప్రాణాంతకమైనదే. అయినప్పటికి దీనిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు. కొన్ని సంకేతాల ద్వారా మనం ప్రారంభ దశలో ఉన్న నోటి క్యాన్సర్ ను గుర్తించవచ్చు. ఈ లక్షణాలను, సంకేతాలను అందరూ తెలుసుకోవడం చాలా అవసరం. ప్రారంభదశలో ఉన్న నోటి క్యాన్సర్ ను మనం ఎలా గుర్తించాలి.. అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గొంతులో నిరంతరం నొప్పి, చికాకు, నోరు మందంగా ఉన్నట్టు అనిపించడం వంటి వాటిని నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు. అలాగే ఏదైనా తిన్నా లేదా తాగినా కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే నోటి లోపల తెల్లటి మచ్చలు లేదా ఎరుపు రంగులో ఉండే మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించడం అవసరం. అలాగే గొంతులో ఎప్పుడూ ఏదో ఇరుక్కునట్టు ఉంటుంది. దీనిని డైస్పాగియా అంటారు. ఆహారాన్ని తీసుకున్నప్పుడు మింగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా నోటి క్యాన్సర్ కు ఒక సంకేతం. అదే విధంగా గొంతు బొంగురు పోవడం లేదా మాట్లాడినప్పుడు కరకరలాడడం వంటి ధ్వని రావడం వంటివి కూడా మనం సంకేతాలుగా చెప్పుకోవచ్చు. గొంతు ఇన్పెక్షన్ బారిన పడినప్పుడు కూడా గొంతు బొంగురుపోతుంది. అయితే ఇది ఎక్కువ కాలం పాటు ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం అవసరం.
అలాగే దగ్గు శ్వాస సంబంధిత సమస్య అయినప్పటికి నిరంతరం వచ్చే దగ్గు, ఎక్కువ కాలం పాటు ఉండే దగ్గు నోటి క్యాన్సర్ కు ఒక సంకేతం. నోటి క్యాన్సర్ తో బాధపడే వారిలో నమలడం, మింగడం, మాట్లాడడం చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బంది గనుక ఎక్కువ కాలం పాటు ఉంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది. అదే విధంగా నోరు, పెదవులు, నాలుక వంటి భాగాలు తిమ్మిరి పట్టినట్టుగా, జలదరించినట్టుగా ఉంటాయి. ఇది కూడా నోటి క్యాన్సర్ లో కనిపించే ప్రారంభ లక్షణాల్లో ఒకటి. అలాగే దవడను, మరియు నాలుకను కదిలించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నోరు కూడా పూర్తిగా తెరవలేరు. ఇది కూడా నోటి క్యాన్సర్ యొక్క లక్షణాల్లో ఒకటి. ఈ విధంగా లక్షణాలు కనుక మీలో కనిపించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.