ఈమధ్య కాలంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ విడిపోబోతున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. అయినప్పటికీ తమపై వస్తున్న వార్తలపై వీరు ఎక్కడా కూడా స్పందించడం లేదు. దీంతో ఆ వార్తలు నిజమే అని ఫ్యాన్స్ సైతం అనుకుంటున్నారు. అయితే తాజాగా అభిషేక్, ఐశ్వర్యలకు చెందిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అభిషేక్.. ఐశ్వర్యను పట్టించుకోకుండా పోవడం చూసి అభిమానులు సైతం షాకవుతున్నారు. వీడియో పాతదే అయినప్పటికీ దాన్ని మళ్లీ నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.
అప్పట్లో ఐశ్వర్యారాయ్‌కు చెందిన సరబ్‌జిత్ అనే మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో అభిషేక్ కూడా పాల్గొన్నాడు. అయితే ఇద్దరూ ఫొటోలకు పోజులు ఇవ్వాలని మీడియా అడగ్గా.. అందుకు అభిషేక్ మాత్రం స్పందించలేదు. కానీ ఐశ్వర్యే దగ్గరకు వెళ్లి చెప్పడంతో అతను అందుకు ఒప్పుకున్నాడు. ఇక అక్కడ ఒక్క సెకన్ కూడా ఉండకుండా అభిషేక్ వెంటనే వెళ్లిపోయాడు. దీంతో అతని ప్రవర్తనకు అప్పుడు ఐశ్వర్య బిత్తరపోయింది. కానీ మీడియా ఉంది కనుక అందరి ముందు ఐశ్వర్య స్మైల్ ఇస్తూ ఒక్కతే ఫొటోలు దిగింది.
అయితే అప్పట్లో అభిషేక్ ఇలా ప్రవర్తించాడంటూ ఇప్పుడు నెటిజన్లు మళ్లీ ఆ పాత వీడియోను షేర్ చేస్తున్నారు. కాగా ఈ మధ్యే ముకేష్ అంబానీ ఇంట్లో జరిగిన శుభ కార్యానికి సైతం ఇద్దరూ వేర్వేరుగా హాజరయ్యారు. అలాగే సైమా అవార్డ్స్‌కు సైతం విడి విడిగానే వచ్చారు. దీంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ మరోసారి గుప్పుమంటున్నాయి. ఇక అభిషేక్ ప్రస్తుతం కింగ్ అనే మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు. అందులో షారుక్ ఖాన్ హీరో. ఆ మూవీలో షారుక్ తనయ సుహానా ఖాన్ కూడా నటిస్తోంది.