Sesame Seeds Laddu : భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లోనే కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పొడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. నువ్వులలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మం, ఎముకలు, జుట్టుకు చాలా మంచిది. నువ్వులు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. నువ్వులు కాలేయం, చర్మానికి కూడా మేలు చేస్తాయి.
నువ్వులలో ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కొత్త ఎముకలను నిర్మించడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బాడీలో ఐరన్ సమపాళ్లలో లేనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. అన్నిటికీ టాబ్లెట్లు వాడే బదులు ఇంట్లోనే ఐరన్ సంబంధిత పదార్థాల ద్వారా బ్లడ్ లెవల్స్ పెంచుకోవచ్చు. తెల్ల నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
అలాగే బెల్లం. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వాల్ నట్స్‌లో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి ఈ మూడు పదార్థాలు కలిపి లడ్డూలా తయారు చేయాలి. ఒక కప్పు నువ్వులను దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఒక కప్పు వాల్ నట్స్ ను కూడా పొడి చేయాలి. తగినంత బెల్లం తీసుకుని మూడు కలిపి కొద్దిగా ఆవునెయ్యి కలిపి లడ్డూలు చేయాలి. వీటిని రోజుకొకటి తింటూ ఉంటే రక్తహీనతను తొలగించి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా తోడ్పడుతాయి. కనుక వీటిని రోజూ తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.