దేశ జనాభా నానాటికి పెరుగుతూ పోతుంటే,ఏపీలో మాత్రం యువ జనాభా తగ్గిపోతుంది. అందుకే రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే అర్హులయ్యేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉందని చెప్పారు.రాష్ట్ర అభివృద్ధి రేటు పెరగాలని, అందరూ దీనిపై ఆలోచించాలన్నారు. కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా కుటుంబాలు ప్రణాళికలు వేసుకోవాలన్నారు.
గతంలో ఉన్న ఇద్దరు పిల్లల చట్టాన్ని ఆగస్టు 7న రాష్ట్ర కేబినెట్ రద్దు చేసింది.ఈ నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనేక జిల్లాల్లో యువత ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారని చంద్రబాబు తాజాగా వెల్లడించారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలాంటి కుటుంబ ప్రణాళికా విధానాల్లో మార్పులకు పిలుపునిచ్చారు. అప్పట్లో ఎక్కువ మంది పిల్లలను కలిగిన దంపతులకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు దేశంలో జనాభా నియంత్రణలో కీలక పాత్ర పోషించాయి.
జనాభా సమతుల్యత, వృద్ధాప్య జనాభా పెరుగుతుండటంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు సూచించారు.2047 వరకు మాత్రమే జనాభా ప్రయోజనం ఉందని, 2047 తర్వాత ఏపీలో యువకుల కంటే వృద్ధులు ఎక్కువ మంది ఉంటారని ఆయన అంచనా వేశారు. ఇది ఇప్పటికే జపాన్, చైనా, ఐరోపాలోని అనేక దేశాలలో జరుగుతోందన్నారు. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనడం మీ బాధ్యత అని తెలిపారు.