హిందువులు పూజా సమయాలలో ఎక్కువభాగం రాగితో తయారుచేసిన పూజాసామాగ్రిని ఉపయోగించడం మనం చూస్తుంటాం. పూజ సమయంలో ఈ విధంగా రాగి పాత్రలను వాడటం వెనుక ఉన్న అర్థం, పరమార్థాన్ని వరాహపురాణంలో వరాహస్వామి భూదేవికి వివరించారు.
వరాహ పురాణం ప్రకారం.. కొన్ని యుగాల క్రితం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువు గురించి ఎంతో భక్తితో తపస్సు చేశాడు. ఆ రాక్షసుడి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవాలని అడగగా అందుకు గుడాకేశుడు తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతుడిలో ఐక్యం చేసుకోవాలని కోరాడు. అదే విధంగా తన శరీరంతో తయారు చేసిన సామాగ్రిని పూజా సమయంలో ఉపయోగించాలని కోరాడు.
ఇందుకు విష్ణువు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజు నీ కోరిక తీరుతుందని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రావడంతో గుడాకేశుడి తల సుదర్శన చక్రంతో ఖండించబడుతుంది. ఈ క్రమంలోనే తన ఆత్మ వైకుంఠం చేరగా తన శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తనకు పూజా సమయంలో ఉపయోగించాలని విష్ణుదేవుడు తన భక్తులను ఆదేశించాడు. అప్పటినుంచి పూజా సమయంలో రాగి వస్తువులను వాడటం ఆచారంగా వస్తోందని వరాహ స్వామి భూదేవికి వివరించాడు.