Ramesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఆయన అన్న రమేష్ బాబుకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇద్దరూ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు తన సినిమా కెరీర్‌ని అన్నయ్య రమేష్ బాబుని చూసి మొదలుపెట్టారు. అల్లూరి సీతారామ రాజు చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు రమేష్ బాబు. సామ్రాట్ చిత్రంతో రమేష్ బాబు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. స్వయంగా రమేష్ బాబు కోసం కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తన కొడుకుని స్టార్ గా చూడాలనుకున్నారు. రమేష్ బాబు హీరోగా కళియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సమయంలోనే రమేష్ బాబుతో కలిసి మహేష్ బాబును నటింపజేశారు కృష్ణ. కొడుకు కోసం ఎంతో తాపత్రయపడినా కూడా ఆయన రేంజ్ లో స్టార్ స్టేటస్ ని సాధించలేకపోయారు రమేష్ బాబు.
రమేష్ బాబు చదువుకునే సమయంలో కృష్ణ సూపర్ స్టార్ గా దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తండ్రి కృష్ణని చూసి రమేష్ బాబు కూడా ఆయనలా హీరో అవ్వాలనుకున్నారు. అల్లూరి సీతారామ రాజు చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు మొదటి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత పన్నేండ్లకు మనుషులు చేసిన దొంగలు మూవీలో నటించారు. ఆ తరువాత 14 ఏళ్ల సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. సినిమాల మీద దృష్టితో రమేష్ బాబు చదువు పాడవుతుందనే ఉద్దేశంతో సినిమాకు దూరంగా పంపించారు కృష్ణ. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష రాయగానే సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రమేష్ బాబు.
మా అభిమాన హీరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడని ప్రేక్షకులు ఆయన చిత్రాన్ని బాగానే ఆదరించారు. అప్పటికే ఇండస్ట్రీలో నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలలో సక్సెస్ సాధించి స్టార్ హీరోలుగా పేరు పొంది ముందుకు దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వారసుల్లో ఎవరు టాప్ హీరోలుగా రాణిస్తారు అనే విషయంపై రమేష్ బాబు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. నటన పరంగా రమేష్ బాబు అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సామ్రాట్ తరువాత చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ ఘన విజయాలు సాధించకపోయినా ఒక మోస్తరు మార్కులతో సరిపెట్టుకున్నాయి. కానీ కృష్ణ మాత్రం రమేష్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ రావాలని ఆశించారు. రమేష్ బాబుతోపాటు మహేష్ బాబుని కూడా నటింపజేసి మూవీకి కొత్త క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. కృష్ణగారి అబ్బాయి, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడల్ సవాల్, పచ్చతోరణం సినిమాలు బాగా ఎదగాలనుకున్న రమేష్ బాబు కెరియర్ గ్రాఫ్ ని తగ్గించేశాయి.
రమేష్ బాబు నటించిన పది చిత్రాల్లో నాలుగు మాత్రమే సక్సెస్ సాధించడంతో మానసిక ఒత్తిడితో ఆయన సినిమాలకు దూరమైపోయారు. సొంత వ్యాపారం పెట్టుకొని తాను సాధించలేని సక్సెస్ ను తన తమ్ముడు సాధించాలని ఆయన సినిమా బాధ్యతలను మహేష్ బాబుకి అప్పగించారు. తమ్ముడు నటించే ప్రతి చిత్రాన్ని తన పర్యవేక్షణలో ఎంతో జాగ్రత్త వహించేవారు రమేష్ బాబు.
తమ్ముడంటే రమేష్ బాబుకు ఎంత ప్రాణమో అన్న అంటే మహేష్ బాబుకు కూడా అంతే ప్రాణం. కాగా రమేష్ బాబు గుండెపోటుతో మరణించారు. తన అన్న మరణించినప్పుడు కరోనా కారణంగా చివరి చూపు చూడలేనందుకు తన బాధను ఒక పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. నువ్వు నాకు అడుగులు నేర్పించావు. నా విజయంలో ప్రతీ సంతోషం నీదే. ఎప్పటికి నీవు నా అన్నయ్యవే. జీవితంలో అలసిపోయావు. ఇక విశ్రాంతి తీసుకో. నిన్ను ఎప్పటికి మరువనంటూ తన బాధను ఎమోషనల్ గా అన్న గురించి అక్షర రూపంలో మహేష్ బాబు పంచుకున్నారు.