సాధారణంగా మనం రోజూ భిన్న రకాల ఆహార పదార్థాలను తింటుంటాము. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో అనేక ఆహారాలను కలిపి తింటాము. దీంతో మంచి రుచి వస్తుంది. కొందరు రుచి కోసం ఇలా భిన్న ఆహారాలను కలిపి తింటారు. కానీ కొందరు శక్తి, పోషకాల కోసం అలా చేస్తారు. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం కలిపి తినరాదు. కొన్నిఫుడ్ కాంబినేషన్లు మనకు హాని కలిగిస్తాయి. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఒకేసారి తినరాదు. ఏదైనా ఒక ఆహారాన్ని మాత్రమే తినాలి. అంటే కోడిగుడ్లు, చికెన్, మటన్, పాలు, పప్పు దినుసులు.. ఇలా వీటిలో ఏది తిన్నా ఒకే ఆహారాన్ని తినాలి. దాన్ని మిగిలిన ఆహారాలతో కలిపి తినరాదు. తింటే గుడ్లను మాత్రమే తినాలి. లేదా చికెన్ తినాలి. అంతేకానీ రెండింటినీ కలిపి తినరాదు. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కనుక వీటిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. అజీర్తి, గ్యాస్, అసిడిటీ వస్తాయి. కాబట్టి ఈ ఆహారాలను కలిపి తీసుకోరాదు.
2. పాలు, నిమ్మ జాతికి చెందిన పండ్లను ఒకేసారి తీసుకోరాదు. అలా తీసుకుంటే గ్యాస్, గుండెల్లో మంట వస్తాయి. కనుక రెండింటికీ మధ్య కనీసం 1 గంట వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
3. పాలు, అరటి పండ్లను కలిపి కొందరు మిల్క్ షేక్ రూపంలో తీసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయరాదు. ఎందుకంటే ఈ కాంబినేషన్ జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి గ్యాస్, అజీర్ణం వస్తాయి. కనుక ఈ కాంబినేషన్ మంచిది కాదు.
4. పండ్లను ఎప్పుడు కూడా భోజనానికి, భోజనానికి మధ్యలో 2 గంటల వ్యవధి చూసుకుని తినాలి. కానీ కొందరు భోజనం చేసిన వెంటనే పండ్లను తింటారు. ఇలా చేయరాదు. ఇలా పండ్లను తింటే వాటిల్లో ఉండే పోషకాలను శరీరం శోషించుకోలేదు. కనుక భోజనం చేసిన తరువాత లేదా చేయడానికి 2 గంటల ముందు మాత్రమే పండ్లను తినాలి. అయితే భోజనం చేసే ముందు వెజిటబుల్ సలాడ్ తింటే మంచిది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
5. కొందరు శీతల పానీయాలను భిన్న రకాల ఆహారాలతో తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి బాగా హాని కలుగుతుంది. అసలు శీతల పానీయాలను ఎట్టి పరిస్థితిలోనూ తాగరాదు. వాటిల్లో అధిక మొత్తంలో చక్కెర, క్యాలరీలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అధికంగా బరువును పెంచుతాయి. హార్మోన్ల సమస్యలు వచ్చేలా చేస్తాయి. కనుక శీతల పానీయాలను సేవించకపోవడమే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365