మన దేశంలో ఉన్న పౌరులకు తాము సంపాదించుకునే డబ్బును అనేక విధాలుగా పొదుపు చేసుకునేందుకు పలు రకాల స్కీంలు లభిస్తున్నాయి. బ్యాంకులతోపాటు పోస్టాఫీసుల్లోనూ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది బ్యాంకులకే ప్రాధాన్యతను ఇస్తారు కానీ పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌ల పట్ల ఆసక్తిని చూపరు. నిజానికి బ్యాంకుల కన్నా పోస్టాఫీస్ సేవింగ్ స్కీంల ద్వారానే ఎక్కువ ఫలితం ఉంటుంది. వడ్డీ ఎక్కువ వస్తుంది. అందుకే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టాఫీసుల్లో వివిధ స్కీంలలో తమ డబ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అసలు పోస్టాఫీసుల్లో మనకు ఎలాంటి పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీం
కేవలం నగదు ద్వారా మాత్రమే ఖాతా తెరవాలి. మినిమం బ్యాలెన్స్ రూ.50 మెయింటెయిన్ చేయాలి. రూ.500లతో అకౌంట్ ఓపెన్ చేస్తే చెక్ బుక్ ఇస్తారు. అయితే రూ.500 మినిమం బ్యాలెన్స్‌ను ఎప్పుడూ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఎప్పుడైనా కానీ సదరు అకౌంట్‌కు నామినీని ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. దేశంలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా మరొక పోస్ట్ ఆఫీస్‌కు ఈ అకౌంట్‌ను బదిలీ చేసుకోవచ్చు. అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే 3 సంవత్సరాల కాలంలో కనీసం ఒక ట్రాన్సాక్షన్ అయినా జరగాలి. క్యాష్ వేయడం కానీ, తీయడం కానీ జరగాలి. క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ అన్నీ ఎలక్ట్రానిక్ మోడ్‌లోనే జరుగుతాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీంలో అకౌంట్ తెరిచిన వారికి పలు చోట్ల ఏటీఎం సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సంవత్సరానికి 4 శాతం వడ్డీని చెల్లిస్తారు.
2. 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (ఆర్‌డీ)
క్యాష్, చెక్ ఏ రూపంలో అయినా నగదు డిపాజిట్ చేసి ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. చెక్ అయితే అది ఇచ్చే రోజున అదే డేట్ వేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌లోనూ నామినీని ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు లేదా తరువాత అయినా నామినీని పెట్టుకోవచ్చు. ఏడాది తరువాత డిపాజిట్ చేసిన సొమ్ములో 50 శాతం వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఏ పోస్ట్ ఆఫీస్‌లో అయినా ఆర్డీ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే నిర్దిష్టమైన నెలవారీ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం కొంత నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. తరువాతే నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లించాలి. ఈ పథకంలో ఏడాదికి 6.9 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు.
3. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అకౌంట్
బ్యాంకుల్లో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ లాగే ఈ అకౌంట్ ను పోస్టాఫీస్ లలో తెరవవచ్చు. ఖాతాదారులు తమకిష్టమైన రీతిలో నిర్దిష్టమైన మొత్తంతో (పరిమితి ఏమీ లేదు) ఖాతా తెరిచేందుకు వీలుంటుంది. దీనికి టైం పీరియడ్ ఉంటుంది. గరిష్ట కాల వ్యవధి 5 ఏళ్లు కాగా, కనిష్ట కాల వ్యవధి 1 సంవత్సరం. ఏడాదిపాటు డబ్బును డిపాజిట్ చేసి ఉంచితే 6.6 శాతం వరకు వడ్డీ ఇస్తారు. 2 ఏళ్లు అయితే 6.7 శాతం, 3 ఏళ్లు అయితే 6.9 శాతం, 5 ఏళ్లు అయితే 7.4 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. అయితే 3 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కిస్తారు. కానీ ఏడాదికి ఒకసారి మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. ఈ ఖాతా తెరిచిన వారికి ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌ను కూడా ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు.
4. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీం అకౌంట్
వ్యక్తిగతంగా ఈ ఖాతాను తెరవాలి. క్యాష్, చెక్ ఎలా అయినా నగదు చెల్లించి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీనే చెక్‌పై వేయాల్సి ఉంటుంది. అకౌంట్‌కు నామినీ సౌకర్యం ఉంది. ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు అకౌంట్‌ను మార్చుకోవచ్చు. ఒక పోస్టాఫీస్‌లో ఈ ఖాతాలు ఎన్నింటినైనా తెరవచ్చు. కానీ అన్ని ఖాతాల్లో కలిపితే వచ్చే నగదు బ్యాలెన్స్ పరిమితిని మించరాదు. నెల నెలా వడ్డీ అకౌంట్‌లో జమ అవుతుంది. ఏడాది తరువాత అకౌంట్లలో ఉండే బ్యాలెన్స్‌ను డ్రా చేయవచ్చు. కానీ అందులో కొంత మొత్తం ఫీజు కింద తీసుకుంటారు. అదే 3 ఏళ్ల లోపల నగదు తీస్తే 2 శాతం, 3 ఏళ్లు దాటాక తీస్తే 1 శాతం ఫీజు తీసుకుంటారు. ఈ పథకంలో పొదుపు చేస్తే ఏడాదికి 7.3 శాతం వడ్డీ చెల్లిస్తారు.
5. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీం (ఎస్‌సీసీఎస్)
60 ఏళ్లు పైబడిన వారు ఈ అకౌంట్‌ను తెరవచ్చు. 55 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు వీఆర్ఎస్ తీసుకుంటే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే లోపు అకౌంట్ ను తెరవచ్చు. 5 ఏళ్ల తరువాతే సొమ్ము మెచూర్ అవుతుంది. వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గా ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. చెక్‌తో అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెన్ అయిన తేదీని చెక్‌పై వేయాలి. అకౌంట్‌కు నామినీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు అకౌంట్‌ను మార్చుకోవచ్చు. అకౌంట్‌లోకి వడ్డీ ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతుంది. 3 నెలలకు ఒకసారి వడ్డీ క్రెడిట్ చేస్తారు. ఏడాది తరువాత ప్రీమేచుర్ క్లోజర్ చేయవచ్చు. 1.5 శాతం ఫీజు తీసుకుంటారు. రెండేళ్ల తరువాత అయితే 1 శాతం ఫీజు ఉంటుంది. ఈ అకౌంట్ ద్వారా లభించే బెనిఫిట్ రూ.10వేలు దాటితే టీడీఎస్ కట్ చేస్తారు.
6. 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్
రూ.100 నుంచి రూ.1.50 లక్షల మధ్య ఎంత మొత్తంతో అయినా ఈ అకౌంట్ తెరవచ్చు. కానీ ఏడాదికి కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం కుదరదు. సింగిల్ అకౌంటే ఇస్తారు. క్యాష్, చెక్ రూపంలో నగదు చెల్లించవచ్చు. చెక్ అయితే అకౌంట్ ఓపెన్ అయిన తేదీనే చెక్‌పై వేయాలి. నామినీ ఫెసిలిటీ, ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు అకౌంట్‌ను మార్చుకునే ఫెసిలిటీని అందిస్తున్నారు. 15 ఏళ్లకు మెచూరిటీ పీరియడ్ ఉంటుంది. తరువాత ఒక ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు అవసరం అనుకుంటే దాన్ని పొడిగించుకోవచ్చు. 15 ఏళ్లు కాకుండా అకౌంట్‌ను క్లోజ్ చేయడం కుదరదు. ఈ డిపాజిట్లకు ఆదాయపు పన్ను సెక్షన్ 80సి ప్రకారం మినహాయింపు ఉంటుంది. వడ్డీకి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. అకౌంట్ ఓపెన్ చేశాక 7 ఏళ్ల తరువాత ఏడాదికి ఒకసారి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. 3వ ఏడాది అయ్యాక డిపాజిట్ సొమ్ముపై లోన్ తీసుకోవచ్చు.
అయితే పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న ఈ స్కీముల్లో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఈ రేట్లను మారుస్తుంది. కనుక ఈ వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.