ఏదైనా విషయం చెబితే దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం విద్యార్థులకు వేర్వేరుగా ఉంటుంది. మందబుద్ధి ఉన్నవారు ఆలస్యంగా తెలుసుకుంటారు. తెలివిగల వారు త్వరగా అర్థం చేసుకుంటారు. ఇక ఇవేవీ కాని కోవకు చెందిన వారు అసలు అర్థమే చేసుకోలేరు. మరి ఇన్ని రకాలకు చెందిన విద్యార్థులకు అందరికీ కలిపి ఒకే లాంటి పరీక్ష పెడితే ఎలా ? అది కరెక్టేనంటారా ? విద్యార్థి చదువుకున్న మేర అతనికి లభించిన జ్ఞానానికి మాత్రమే పరీక్ష పెట్టాలి. కానీ అలా జరగడం లేదు. అందరికీ ఒకేలా పరీక్ష పెడుతున్నారు. దీంతో చదువు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. కానీ చదువు రాని వారికి తీవ్రమైన సమస్య కలుగుతోంది. మరి ఇందులో తప్పు ఎక్కడ ఉందంటారు..? కచ్చితంగా మన విద్యావ్యవస్థలోనే ఆ లోపం ఉంది. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్న వ్యవస్థ ఇది. ఇప్పటికైనా మారాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలి అంటే..
విద్యార్థి 5వ తరగతి చదువుతున్నప్పుడు అతనికి 11-12 ఏళ్లు ఉంటాయి కదా. ఆ వయస్సులో వారిలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకోవాలి. వారికి ఏమేం అంశాలు అంటే నచ్చుతాయో గమనించాలి. ఆ అంశాల పట్ల వారికి ఎంతటి నైపుణ్యం ఉందో చూడాలి. పెయింటింగ్, రైటింగ్, స్కెచింగ్, క్రీడలు.. ఇలా అంశం ఏదైనా కావచ్చు, విద్యార్థి దేని పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడో తెలుసుకోవాలి. విద్యార్థుల్లో ఏదైనా అంశం పట్ల ఆసక్తి ఉందని, వారిలో ఆ అంశానికి చెందిన నైపుణ్యత ఉందని తెలుసుకుంటే వారికి పరీక్ష పెట్టాలి. వారు ఏ మేర అందులో రాణిస్తున్నారో చూడాలి. విద్యార్థి తనకు ఫలానా అంశంలో ఆసక్తి ఉందని చెప్పాక, అతనిలో నైపుణ్యాలను పరీక్షించాక అతనికి ఓ మెంటార్‌ను ఏర్పాటు చేయాలి. మెంటార్ అంటే ఇక్కడ పాఠాలు చెప్పే గురువే. కానీ విద్యార్థిలోని ఆ నిర్దిష్టమైన నైపుణ్యతకు పదును పెట్టే గురువు అయి ఉండాలి. దీంతో విద్యార్థి చిన్నతనం నుంచే తనకు ఇష్టమైన అంశంలో మేటిగా రాణిస్తాడు.
విద్యార్థికి నిర్దిష్టమైన అంశంలో ఉన్న నైపుణ్యతను బట్టి అతనికి రోజూ కొంత సమయం పాటు లేదా వారంలో కొన్ని రోజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అతని నైపుణ్యాలను మెరుగు పరిచే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు తాము చదివే చదువులకు గాను ఎలాగైతే పరీక్షలు పెడతారో తాము ఆసక్తి చూపిస్తున్న అంశాల్లో ట్రెయినింగ్ ఇస్తూ కూడా అప్పుడప్పుడు పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో వారి నైపుణ్యం మరింత పెరుగుతుంది. మెంటార్ ఈ పని చేయాల్సి ఉంటుంది. విద్యార్థి తనకు ఇష్టం ఉన్న అంశాన్ని ఎంచుకోవడంలో విఫలం అయితే అప్పుడు కూడా మెంటార్ శ్రద్ధ తీసుకోవాలి. అవసరం అనుకుంటే విద్యార్థిలోని నైపుణ్యాలను గ్రహించి ఫలానా అంశం అయితే అందులో విద్యార్థి రాణిస్తాడు అని తెలుసుకుని ఆ దిశగా ఆ అంశంలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. చదువును నిరంతరాయంగా ఎలా చదువుతారో విద్యార్థులు ఆసక్తి చూపించే ఇతర అంశాలకు కూడా నిరంతర ప్రాక్టీస్ అవసరం. అలా చేస్తే వారిలో మరింత నైపుణ్యం పెరుగుతుంది.
విద్యార్థులకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలి. కానీ ఎంత సేపూ మన విద్యావ్యవస్థ చదువు, ఉద్యోగం సంపాదించు అన్న కోణంలొనే విద్యార్థులను ముందుకు తీసుకెళ్తుంది. పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవసరం అయ్యే శిక్షణను, సూచనలను మన విద్యాసంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు తెలియజేయడం లేదు. అన్నింటి కన్నా ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే ఓటములను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై పాఠశాలల్లో విద్యార్థులకు బోధన జరగాలి. అలా జరిగితే వారు ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించుకోగలిగే వారిలా మారుతారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పని సాధిస్తారు.
చివరిగా మరో ముఖ్యమైన విషయం. విద్యార్థులకు ప్రత్యేక ఆసక్తి ఉన్న అంశాలకు చెందిన పుస్తకాలను ఇవ్వాలి. దీంతో వారి జ్ఞానం మరింత పెరుగుతుంది. అవసరం అయితే అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో, వాటిలో ఉండే నాలెడ్జ్‌ను ఎలా సంపాదించాలో విద్యాసంస్థలు విద్యార్థులకు చెప్పాలి. ఈ సూచనలు పాటిస్తే విద్యావ్యవస్థలో మార్పు తప్పక వస్తుంది. దాంతో నైపుణ్యం ఉన్న విద్యార్థులు బయటకు వస్తారు. రేపటి నవ యువ భారతానికి కావల్సింది అదే కదా.