Health Tips : చలికాలంలో సహజంగానే ఎవరైనా సరే చలికి ముసుగు తన్ని పడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఒళ్లంతా బద్దకంగా అనిపిస్తుంటుంది. ఇక ఉదయం అయితే త్వరగా నిద్రలేవబుద్ది కాదు. అయితే చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో కింద తెలిపిన పలు ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. ఆయుర్వేద ప్రకారం నెయ్యి మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఈ సీజన్‌లో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో మలబద్దకం వస్తుంటుంది కనుక నెయ్యిని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణ సమస్యలు ఉండవు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఇతర శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక ఈ సీజన్‌లో రోజూ తప్పనిసరిగా నెయ్యిని తీసుకోవాలి.
2. ముల్లంగిలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. రోజూ ముల్లంగిని తినలేని వారు ఒక కప్పు జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది.
3. ఉల్లిపాయలు, వెల్లుల్లిలలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని అనేక సమస్యల నుంచి బయట పడేస్తాయి. ఈ సీజన్‌లో ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాదు, శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.
4. రోజూ అల్లం రసం సేవించడం వల్ల కూడా శరీరం వెచ్చగా ఉంటుంది. లేదా అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుండాలి.
5. ఆవాలు, నువ్వులను లేదా వాటితో తయారు చేసే నూనెలను ఉపయోగించడం వల్ల కూడా శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఈవిధంగా చేయడం వల్ల చలికాలంలో చలిని తరిమికొట్టి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.