Animals : సాధారణంగా మనం పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురు వచ్చేలా చేసుకుంటాం. దీంతో చేయబోయే పని దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్ముతాం. అందుకనే మన ఇంట్లో ఉండే అమ్మ లేదా భార్య, సోదరి, ఇతర మహిళలను మనకు ఎదురు రమ్మని చెబుతుంటాం. అయితే వాస్తవానికి మనకు కొన్ని రకాల జంతువులు ఎదురు పడినా కూడా అంతా మంచే జరుగుతుందట. అవును, కొన్ని రకాల జంతువులు ఎదురు వస్తే ఆ రోజు పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయట. అంతా కలిసే వస్తుందట. ఇక ఏ జంతువులను అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారో ఇప్పుడు చూద్దాం.
ఏనుగు అంటే చాలా మందికి జ్ఞానం, బలం, అదృష్టం ఇస్తుందని నమ్ముతారు. ఏనుగును ఇలా విశ్వసించేవారు చాలా చోట్ల ఉన్నారు. కనుక ఏనుగు మీకు ఎదురు వస్తే ఎంతో మంచి జరుగుతుంది. చేయబోయే పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే లేడీ బగ్ అని పిలవబడే పురుగులు ఎదురైనా లేదా అవి మీ ఇంట్లో కనిపించినా అంతా శుభమే జరుగుతుందని కూడా విశ్వసిస్తారు.
మిడతలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని కొన్ని జాతుల వారు విశ్వసిస్తారు. పలు ఆసియా దేశాల వారు ఈవిధంగా నమ్ముతారు. కనుక మిడతలు ఎదురైతే దాన్ని శుభ శకునంగా భావించాలి. కొన్ని ప్రాంత వాసులు కప్పలను అదృష్టానికి సంకేతాలుగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కప్ప ఎదురుగా వస్తే అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. దీన్ని అదృష్టానికి, సంపదకు సంకేతంగా విశ్వసిస్తారు.
పిల్లి ఎదురైతే అశుభ శకునమని చాలా మంది నమ్ముతారు. కానీ జపాన్ వాసులు మాత్రం పిల్లి ఎదురైతేనే మంచిదని విశ్వసిస్తారు. ముఖ్యంగా మనం బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి దేన్నయినా నోట కరుచుకుని వచ్చి కనిపిస్తే మనం చేయబోయే పని పూర్తవుతుందని నమ్ముతారు. అలాగే నత్త గుల్లలు, చేపలు, తాబేలు, ఆవు వంటి జీవులు ఎదురైనా కూడా అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా ఆవు ఎదురైతే గోమాతగా భావించి పూజలు చేస్తారు. ఇక ఆ రోజంతా తమకు తిరుగుండదని భావిస్తారు. ఇలా కొన్ని రకాల జంతువులు ఎదురైతే అంతా శుభమే జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.