Diabetes : ప్రస్తుత తరుణంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగానే వస్తుందని చెప్పవచ్చు. దీని వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఇన్సులిన్ నిరోధకత ఏర్పడడం వల్ల శరీరంలో తయారైన గ్లూకోజ్‌ను కణాలు స్వీకరించవు. దీంతో గ్లూకోజ్ రక్తంలో అలాగే ఉంటుంది. దీర్ఘకాలంగా ఇలా జరిగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీన్నే డయాబెటిస్ అంటారు. ఇలా చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించుకోగలిగితే టైప్ 2 డయాబెటిస్‌ను చాలా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. అందుకు గాను ఉదయాన్నే ఖాళీ కడుపుతో పలు ఆహారాలను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతులను తీసుకోవాలి. రాత్రిపూట రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ మెంతులను తిని అవే నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అలాగే ఉదయాన్నే దాల్చిన చెక్క డికాషన్‌ను కూడా తాగవచ్చు. 300 ఎంఎల్ నీటిలో 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసి మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే పరగడుపునే తాగేయాలి. ఇలా రోజూ చేస్తుండడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు.
ఉదయాన్నే నట్స్‌ను తినడం వల్ల కూడా చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అయితే వీటిని రాత్రంతా నానబెట్టాలి. ముందు రోజు రాత్రి వాల్ నట్స్ లేదా బాదంపప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటి పొట్టు తీసి తినాలి. వీటిని రోజూ ఖాళీ కడుపుతో తింటుంటే ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఉదయం ఖాళీ కడుపుతో 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను సేవించవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలోకి తెస్తుంది. అయితే కలబంద రసం కొందరికి పడదు. అలర్జీలు వస్తాయి. అలాంటి వారు దీన్ని తాగకూడదు. ఈ విధంగా పలు ఆహారాలను రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించుకుని డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా కూడా ఉంటారు.