హిందువుల సాంప్రదాయం ప్రకారం….సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి. అవి.1) ఉగాది. 2) అక్షయ తృతియ 3) విజయదశమి. అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది.. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు.
మన పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత.. వేద వ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారతం ఆరంభించాడు. విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయనాడే. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే నియమానికి స్టార్టింగ్ పాయింట్ గా చెప్పుకునే లాజిక్.. కుచేలుడు దారిద్ర్యంతో అష్టకష్టాలు పడుతూ.. ఓ రోజు తన ప్రాణ స్నేహితుడైన శ్రీ కృష్ణుడిని చూసేందుకు వెళ్తాడు. కృష్ణుని వద్దకు వెళ్లేటప్పుడు అటుకులు తీసుకెళ్తాడు. స్నేహితుడిచ్చిన అటుకుల్లో పిడికిలి తీసుకుని తిన్న కృష్ణుడు అక్షయం ప్రాప్తించుగాక అని ఆశీర్వదించాడు. కృష్ణుడి అనుగ్రహంతో కుచేలుడు అష్టైశ్వర్యాలను పొందుతాడు. ఆ రోజునే అక్షయ తృతీయగా పరిగణించబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనిని ఆధారంగా చేసుకొని ఈరోజు కొన్న ప్రతి వస్తువు మూడింతలు అవుతుందని ఓ నమ్మకం.
వాస్తవానికి ఈ రోజు వ్రతం చేస్తే దానికి మూడు రెట్ల పుణ్యం వస్తుంది, పేదలకు దానం చేయడం వల్ల మూడు రెట్ల పుణ్యం వస్తుంది, కొత్త పనులు ప్రారభించడం వల్ల ఎక్కువగా సక్సెస్ అవుతాయి. వాటిని వదిలి బంగారం కొనాలి అనే కొత్త కాన్సెప్ట్ ను మన మీద రుద్దింది మాత్రం బంగారు వ్యాపారస్థులు. మొదట అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే విధానం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేది..కాలక్రమేణ అదే భావన మన దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించింది.
ఇదే నిజమని భావించిన చాలా మంది తమ దగ్గర డబ్బులు లేకున్నప్పటికీ అప్పుచేసి మరీ బంగారం కొనడం, తర్వాత ఆ అప్పుల వడ్డీలు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయడం..చివరకు కొన్న బంగారాన్ని మార్వాడీ షాప్ లో కుదువ పెట్టడం. ఫైనల్ గా ఎంతో ఇష్టంగా కొనుకున్న బంగారం మనది కాకుండా పోవడం… నిత్యం జరుగుతున్న తంతే… సో వీలైతే ఆ రోజు దానం చేయండి, అంతేకానీ డబ్బులు లేకున్నా అప్పుచేసి మరీ బంగారు షాపులకు వెళ్లకండి.మన దేశంలోని బంగారపు షాపులలో అత్యధిక వ్యాపారం జరిగేది ఆరోజేనట.