చాలా మందికి తమ ఇష్టానుసారం వేరువేరు వయసులప్పుడు పెళ్లిళ్లు అవుతుంటాయి. అందువల్ల సాధారణ అంచనాల ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య పెళ్లికి సరైన వయసని చాలామంది అనుకున్నప్పటికీ, పెళ్లికి సరైన వయసు అనేది ఏమీ లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఈ కథనంలో చూద్దాం. చాలామంది జంటలు పెళ్లి ఆలస్యంగా చేసుకోవాలనుకుని అందరూ బాగా ఆలస్యం అనుకునే దాకా చేసుకోకపోవడానికి గల సమస్యలు ఏమిటో చూద్దాం.
పెళ్లి అనేది ఆలస్యం కావడం వల్ల పిల్లలు కూడా ఆలస్యంగానే అవుతారు. అలా జరగడం వల్ల వీరు వృద్ధాప్యంలోకి వచ్చే సమయానికి పిల్లలు సరిగ్గా జీవితంలో సెటిల్ అవ్వకుండా ఇంకా వీరిపైనే ఆధారపడుతుంటారు. కానీ వీరికి ఏమో వయస్సు మీద పడి పని చేసే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో వీరు పిల్లల పైన ఆధారపడాలి. కానీ వారే సెటిల్ కాకుండా ఉంటే ఎవరు ఎవరిమీద ఆధారపడి ఉంటారు. అప్పుడు ఇంట్లో గొడవలు అనేది ప్రారంభం అవుతాయి. ఇక ఆ తర్వాత జీవితం మొత్తం సమస్యలతోనే గడుస్తుంది.
ఇక అదే విధంగా ఈ పెళ్లి విషయంలో సర్దుకుపోవాల్సిన వయస్సులో సర్దుకుపోకుండా, పట్టుకొని కూర్చొని తర్వాత దయనీయ పరిస్థితుల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. అమ్మాయిలకు అయితే ఒకప్పుడు తన భర్త తనను బాగా చూసుకోవాలి, బయటకు తీసుకెళ్లాలి, చీరలు, నగలు కొనివ్వాలి అనే కోరికలు ఉండేవి. కానీ ఇప్పుడు వారే ఉద్యోగాలు చేస్తూ, అవన్నీ తమ సొంతంగా సంపాదించుకుంటున్నారు. అందువల్ల తమకంటే ఎక్కువగా సంపాదించేవాడు, ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండేవాడు భర్తగా రావాలి అనుకుంటారు. వారు అనుకునేవాడు దొరకడంలో ఆలస్యం వల్ల, పెళ్లి చేసుకోవాల్సిన వయస్సు దాటిపోయి తర్వాత శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు.