అమ్మ చెప్పిన అబద్ధాలు. అమ్మలెప్పుడూ నిజం చెప్పరు. వాళ్లను మించిన అబద్ధాలకోర్లు ఈ ఆకాశం కింద లేరు. కావాలంటే చదవండిది.ఈ కధ నా చిన్నప్పుడు మొదలైంది. నేను చాలా పేదరికంలో పుట్టాను. పూటపూటకూ తిండి వెతుక్కునేంత పేదరికం. ఎప్పుడైనా ఇంట్లో అన్నం ఉంటే మా అమ్మ తను తినాల్సిన అన్నం కూడా నాకే పెట్టేది. నా గిన్నెలో అన్నం పెడుతూ -నువ్వు తిను నాన్నా నాకిప్పుడు ఆకలిగా లేదులే-అన్నది. :అది అమ్మ చెప్పిన మొదటి అబద్ధం.
అప్పుడప్పుడూ మా అమ్మ ఊరి దగ్గరిలోని వాగులో చేపలు పట్టేది. ఎదిగే బిడ్డకు కాస్తంత పోషకాహారం పెట్టాలని ఆమె ఆశ. కొనలేదు కాబట్టి వాగు దగ్గర గంటలు గంటలు పడిగాపులు పడేది. ఒకటో రెండో చిన్న చేపలు దొరికేవి. అలాంటపుడు నాకు వండిపెట్టి నేను తిన్నాక మిగిలిన చేపముక్కకు ఏమైనా కండ ఉంటే దాన్ని అమ్మ తినేది. ఊహ తెలిశాక అది చూసి నాకు కష్టమనిపించేది. నేను నా గిన్నెలోంచి ఓ చేపముక్క అమ్మకు వేయబోతే చేయి అడ్డంగా పెట్టి వారిస్తూ-వద్దు నాన్నా నాకసలు చేపల వాసనే పడదు-అన్నది. :అది అమ్మ చెప్పిన రెండో అబద్ధం.
నన్ను బడిలో చేర్పించేందుకు అమ్మ పనిలో కుదిరింది. పాత పేపర్లు తెచ్చి వాటిని జిగురుతో కవర్లు చేసి ఊళ్లో దుకాణాలకు ఇచ్చేది. ఒకసారి నాకు మెలకువ వచ్చిచూస్తే అమ్మ అర్ధరాత్రి కూడా గుడ్డిదీపం వెలుగులో కవర్లు చేస్తూ కనిపించింది. నేను ఎందుకమ్మా ఇంత రాత్రయినా కష్టపడతావు అని అడిగితే-నువ్వు నిద్రపో నాన్నా నేనేమీ అలసి పోలేదు-అన్నది. :అది అమ్మ చెప్పిన మూడో అబద్ధం.
నా ఫైనల్ పరీక్షలకు అమ్మ తోడొచ్చింది. నేను లోపల పరీక్ష రాస్తుంటే తను బయట మండే ఎండలో గంటల సేపు నిరీక్షించింది. బెల్ కొట్టగానే ఎదురొచ్చి నన్ను వాటేసుకుంది. ఒడిలో కూర్చోపెట్టుకుని తను తెచ్చిన పళ్లరసం గ్లాసులో పోసి తాగమంది. కానీ ఎండకు అమ్మ ఒడిలిపోయింది. చెంపలమీద కారుతున్న చెమటను చూసి నువ్వూ తాగమ్మా అని నేను గ్లాసు అందించాను. కానీ, అమ్మ తాగలేదు-వద్దు నాన్నా, నాకసలు దాహమే లేదు-అన్నది. :అది అమ్మ చెప్పిన నాలుగో అబద్ధం.
నాన్న చనిపోయాక అమ్మే నాన్నయింది. కవర్లు తయారు చేస్తే వచ్చే పది రుపాయలే ఇప్పుడు అన్నిటికీ ఆధారం. మా పరిస్థితి దుర్భరంగా మారింది. దాంతో మా అమ్మ పంచాయతీ ఆఫీసుకెళ్లి కొన్ని విత్తనాలు తెచ్చి మా పెరటిలో పాదులు వేసి కూరగాయలు పెంచడం మొదలుపెట్టింది. వాటిని వారం వారం సంతలో అమ్మి మరి కాస్త డబ్బులు తెచ్చేది. మా ఇంటిదగ్గరుండే ఒకాయన మాకు చిన్నా చితకా సాయం చేసేవాడు. మా అమ్మ కష్టాలు చూసి ఇరుగుపొరుగు వాళ్లు చిన్న వయసే కదా మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేవారు. కానీ అమ్మకు నా గురించే బెంగ. వాళ్లు ఈ మాట అన్నపుడల్లా-నాకు ఎదిగే కొడుకున్నాడు, వేరే మనిషెందుకు-అనేది. :అది అమ్మ చెప్పిన అయిదో అబద్ధం.
అమ్మ నన్ను తన శక్తిమేరా చదివించింది. దాంతోనే నేను సిటీకెళ్లి పొట్టనింపుకునేంత జీతమొచ్చే పనిలో కుదిరాను. అమ్మకు ఇకనైనా కాస్త విశ్రాంతి ఇవ్వాలని కొంతలోకొంత మిగిల్చి ఆమెకు పంపాను. కానీ, అమ్మ ఆ డబ్బులు వద్దంది. నన్ను కడుపు కాల్చుకోవద్దంది. పుట్టిన రోజుకు బట్టలు కొనుక్కోమంది-కూరగాయలతో, కవర్లు చేయడంతో నా కొచ్చే పైసలు చాలు నాన్నా, నాకే లోటూ లేదు-అన్నది. :అది అమ్మ చెప్పిన ఆరో అబద్ధం.
నేను అమ్మ వద్దన్న సొమ్ముతో డీటీపీ నేర్చుకున్నాను. పార్ట్ టైం చదువుకుని పీజీ పూర్తిచేశాను. ఓ కంపెనీలో ట్రైనీగా చేరాను. నా పని చూసి వాళ్లు నాకు ఇంకా ట్రైనింగ్ ఇచ్చారు. రెట్టింపు జీతంతో దుబాయ్ పంపించారు. నేనిక జీవితంలో స్థిరపడ్డాను. నాకేలోటూ లేదు. అమ్మని తెచ్చుకుని నాతో ఉంచుకోవడమే ఆలస్యం. నేను అమ్మని అన్నీ సర్దుకొని బయలుదేరమన్నాను. కానీ, అమ్మ రానంది. దేశంకాని దేశంలో నన్ను ఇబ్బంది పెడతాననుకుందో ఏమో- నేను ఈ ఊరు వదిలి రాలేను నాన్నా, నాకు విమానమెక్కాలంటే భయం -అన్నది. :అది అమ్మ చెప్పిన ఏడో అబద్ధం.
చివరకు అమ్మకు జబ్బు చేసింది. ఊళ్లో వాళ్లు హాస్పిటల్‌లో చేర్చి నాకు కబురు చేశారు. నేను సముద్రం దాటి ఆగమేఘాలమీద ఊరికి వచ్చాను. అమ్మ మంచాన పడింది. ఎముకల పోగులా మిగిలింది. నన్ను చూసి నవ్వాలనుకుంది. కానీ, ఆ నవ్వు లోతుకు పోయిన కళ్లను దాటి బయటకు రాలేదు. నాకు ఏడుపు తన్నుకొచ్చింది. అమె మంచం కోడుకు కూలబడ్డాను. అమ్మ నా తల మీద చేయి పెట్టి నిమురుతూ- ఏడవకు నాన్నా, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నా కదా- అన్నది. అది అమ్మ చెప్పిన ఎనిమిదో అబద్ధం. ఆఖరి అబద్ధం. – తొమ్మిదో అబద్ధం చెప్పడానికి అమ్మ బతికి లేదు.
— అరుణ్‌సాగర్