హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలో అత్యంత పవిత్రమైన నెలలో కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీకమాసంలో ప్రతి ఒక్క ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ముఖ్యంగా శివకేశవుల ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో శివకేశవుల ఆలయాలలో దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెలలో చల్లని నీటితో స్నానాలు చేయటం ఎంతో మంచిదని చెబుతుంటారు. కార్తీక మాసంలో రవి తులా రాశిలో ఉండటం వల్ల పారుతున్న నీటికి ఎదురుగా నిలబడి స్నానం చేయడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకోసమే కార్తీకమాసంలో ఎక్కువగా పారుతున్న నదీజలాలు, కాలువలు, సరస్సులలో స్నానాలు చేయడం ఎంతో మంచిది.
ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే.. ప్రతి రోజూ ఉదయం 5:30 గంటలలోపు నిద్రలేచి స్నానమాచరించాలి.
మొదటి సారి మామూలుగా స్నానం చేసి పొడి వస్త్రాలను ధరించి సంకల్పం చెప్పుకొని రెండోసారి స్నానం చేయాలి. ఎవరికైతే ఇలాంటి శ్లోకాలు చెప్పడం రాదో అలాంటి వారు కేవలం ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ స్నానమాచరించడం విశేష ఫలితాలనిస్తుంది.