గతంలో నీలి చిత్రాలను క్యాసెట్లలో చూసేవారు. తరువాత సీడీలు, డీవీడీలు వచ్చాయి. ఇప్పుడు ఫోన్లే చాలు. అరచేతిలోనే ప్రపంచాన్ని చూడగలుడుతున్నారు. దీంతో పిల్లలు కూడా పోర్న్ చిత్రాలకు అలవాటు పడిపోతున్నారు. తమ పెద్దల ఫోన్లను ఎలాగో సంపాదించి ఎవరికీ తెలియకుండా అందులో చూడకూడనివి చూస్తున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ రంగంలో విపరీతమైన మార్పులు రావడంతో ఇలా చాలా తక్కువ ధరకే అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో నీలి చిత్రాలను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇలా నీలి చిత్రాలను చూడడం వల్ల మన ఆరోగ్యంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
నీలి చిత్రాలను ఎక్కువగా చూడడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అధికంగా పెరుగుతాయని అంటున్నారు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయని, ఇవి డిప్రెషన్‌కు దారి తీస్తాయని అంటున్నారు. దేనిపై ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేయాలనిపించదు. ఒక వేళ పనిచేసినా ఏకాగ్రత ఉండదు, దేనిపై దృష్టి, ధ్యాస పెట్టలేరు. పదే పదే ఆ తరహా చిత్రాలను చూడాలనిపిస్తుంది. దీంతో ఆందోళన, కంగారు కూడా మొదలవుతాయి.
పోర్న్‌ను ఎక్కువగా చూడడం వల్ల చాలా మంది తమ ఇంట్లోని వారితో లేదా సమాజంలోని తోటి వ్యక్తులు, స్నేహితులు, బంధువులతో చనువుగా మాట్లాడలేకపోతుంటారు. అందరితోనూ రిలేషన్ తగ్గుతుంది. ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేరు. ఒక వేళ మాట్లాడుదామని ప్రయత్నించినా సిగ్గు పడినట్లు లేదా మర్యాద లేనట్లు అనిపిస్తుంది. ఇవన్నీ పోర్న్‌కు బానిసలు అయ్యారని చెప్పేందుకు సూచనలు. ఇలా ఎవరికైనా అనిపిస్తుంటే కచ్చితంగా అలాంటి చిత్రాలను చూడడం ఆపాలి. తరచూ నలుగురిలోనూ తిరుగుతుండాలి. అలాగే మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి.