చిరంజీవి సినిమా వస్తుందంటే సహజంగానే చాలా మందిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే 1995 జూన్ 15న చిరు నటించిన బిగ్ బాస్ రిలీజ్ అయింది. బిగ్ బాస్ గెటప్ అదిరిపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రజనీకాంత్ బాషా సినిమాను పోలి ఉండడంతో ఇది సూపర్ హిట్ అవుతుందని భావించారు. కానీ ప్రేక్షకుల ఆశలు అడియాశలయ్యాయి. సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.
వాస్తవానికి ఈ సినిమాలో చిరు గెటప్ తప్ప అసలు ఏవీ ప్రేక్షకులకు నచ్చలేదు. హీరోయిజం అంతగా పండలేదనే చెప్పాలి. డైలాగ్స్ కూడా అన్నీ సిల్లీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకి చిరంజీవి వాళ్ళ అమ్మతో అమ్మా మన ఇంట్లో అందరిపేర్లు షార్ట్ కట్ లో బాసు అవుతాయి. నా పేరు బావరాజు సురేంద్ర షార్ట్ కట్ లో బాసు అంటాడు. బాసు అనే పదం కరెక్ట్ కాదు, బాస్ అంటే ఇంగ్లిష్‌లో యజమాని, మరి బాసు అని అనడం ఆ డైలాగ్ రైటర్‌కే చెల్లింది. ఇలాంటి చెత్త డైలాగ్స్ సినిమాలో చాలానే ఉంటాయి. ఇవేవీ ప్రేక్షకులకు అసలు నచ్చలేదు.
నిజంగా ఈ సినిమా చూస్తుంటే డైలాగ్ రైటర్ మీద ఒళ్లు మండుకొస్తుంది. అసలు ఈ సినిమాను చిరు ఎలా అంగీకరించారు అని ఆయన మీద కూడా కోపం వస్తుంది. ఇక దర్శకుడి విషయం సరే సరి. ఆయన గతంలో చిరుతో గ్యాంగ్ లీడర్ తీశారు కదా, అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే ఆయనపై కూడా ప్రేక్షకులకు విపరీతమైన కోపం వచ్చేది. ఇక సినిమాలో అయ్యప్ప స్వామి వేష ధారణలో ఉండి ఒక వ్యక్తిని తన్నడం. ఇది ఒక వర్గం ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. ఇలాంటి పనికి మాలిన సీన్లతో నింపేశారు కనుకనే బిగ్ బాస్ అప్రతిష్టను మూటగట్టుకుంది.