నార్మల్ డెలివరీ అయినా లేదంటే సిజేరియన్ చేసినా పిల్లలు పుట్టాక కచ్చితంగా ఏడుస్తారు. ఒక వేళ అలా ఏడవకపోతే వైద్యులు కచ్చితంగా వారిని ఏడ్చేలా చేస్తారు. వెనుక ఒకటి చరిచో లేదంటే గిల్లి పిల్లలను ఏడిపిస్తారు. అయితే అసలు పిల్లలు పుట్టాక అలా ఎందుకు ఏడుస్తారో, ఒక వేళ ఏడవకపోతే వారిని వైద్యులు ఎందుకు ఏడ్చేలా చేస్తారో మీకు తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారు తల్లి బొడ్డు తాడు నుంచి ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్‌ను రక్తంలోకి వదులుతారు. వారికి ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకునేందుకు వీలుండదు. ఈ క్రమంలో వారు ఒక్కసారిగా తల్లి కడుపు నుంచి బయటికి రాగానే ఊపిరితిత్తుల ద్వారా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. దీంతో ఒక్కసారిగా అలా జరిగే సరికి వారు భయపడిపోయి ఏడుస్తారట.
పిల్లలు పుట్టిన వెంటనే మొదటి 30 నుంచి 60 సెకండ్ల లోపు కచ్చితంగా ఏడుస్తారట. ఈ క్రమంలో వారు అప్పటి వరకు తమ ఊపిరితిత్తులు, ముక్కుల్లో ఉన్న అమ్నియోటిక్ అనబడే ఓ ద్రవాన్ని లోపలికి పీల్చుకుంటారట. అందుకే ఆ సమయంలో ఊపిరాడక ఏడుస్తారట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అదే బయటికి రాగానే పిల్లలు 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఒక్కసారిగా అనుభవిస్తారట. ఇలా వాతావరణంలో సడెన్ చేంజ్ వచ్చేసరికి పిల్లలు ఏడుస్తారట. బిడ్డ పుట్టే సమయంలో ఆ బిడ్డ రక్తంలో కార్బన్ డయాక్సైడ్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. ఈ క్రమంలో అంత పెద్ద మొత్తంలో ఉన్న ఆ వాయువును తట్టుకోలేక బిడ్డ ఏడుస్తుందట.
గర్భంలో ఉన్నప్పుడు ఉండే ద్రవాల కారణంగా బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. అదే తల్లి కడుపు నుంచి బయటికి వచ్చాక బిడ్డకు బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. అలా పెరిగిన బరువును మోయలేక కూడా బిడ్డ ఏడుస్తుందట. తల్లి నుంచి బిడ్డకు ఉండే బొడ్డు తాడు సాధారణంగా 30 నుంచి 60 సెంటీమీటర్ల పొడవు ఉంటుందట. అయితే అంతకు మించితే ఏం కాదు కానీ, తాడు పొడవు అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రం అది బిడ్డ నుంచి త్వరగా విడిపోతుందట. అలాంటి సందర్భాల్లో బిడ్డ గర్భం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ బిడ్డకు చాలా అసౌకర్యంగా ఉండి, బయటకు రాగానే ఏడుపు మొదలుపెడుతుందట.
ఇక బిడ్డ పుట్టగానే కచ్చితంగా ఎందుకు ఏడవాలంటే… అలా ఏడవకపోతే భవిష్యత్తులో ఆ బిడ్డకు శ్వాస కోశ సమస్యలు వస్తాయట. ముఖ్యంగా సైనస్, జలుబు, గొంతు, ముక్కు, చెవి ఇన్‌ఫెక్షన్లు వస్తాయట. అందుకనే డాక్టర్లు కచ్చితంగా బిడ్డను ఏడిపిస్తారు. అయితే ఒకప్పుడు బిడ్డ పుట్టగానే ఏడవకపోతే డాక్టర్లు ఏం చేసే వారంటే… బిడ్డను తలకిందులుగా పెట్టి పిర్రల మీద ఒకటి వేసేవారు. అయితే ఇప్పుడు అందుకు బదులుగా కాళ్లపై లేదంటే వీపుపై మర్దనా చేసి ఏడిపిస్తున్నారు..!