చూడగానే ఇతరులను ఆకట్టుకునేలా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. నేటి తరుణంలో చిన్నా, పెద్ద, ముసలి, ముతకా, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో పలు ఫ్యాషన్ అంశాలపై కూడా వారు దృష్టి సారిస్తూ ఆ దిశగా అందంగా కనిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫ్యాషన్‌గా కనిపించడం కోసం దుస్తులు, ఆభరణాలు, మేకప్, స్టయిలింగ్ వంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటిలో ఇంకో అంశం కూడా దాగి ఉంది. అదే చేతి వేలి గోర్లు. వాటిని కూడా ఇప్పుడు అందరూ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రధానంగా చిటికెన వేలి గోరునైతే అన్నింటి కన్నా ఇంకా కొంచెం ఎక్కువగానే పెంచి స్టయిల్‌గా కనిపించేలా డిజైన్ చేసుకుంటున్నారు.
అయితే చిటికెన వేలి గోరును అన్ని గోర్ల కన్నా పెద్దగా పెంచడం ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో సరిగ్గా తెలియకపోయినా చిటికెన వేలి గోరును పెద్దగా పెంచుకోవడం వెనుక ఫ్యాషన్‌తోపాటు మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గంజాయి, బ్రౌన్ షుగర్, కొకైన్, నల్లమందు ఇలాంటి డ్రగ్స్‌ను ముక్కుతో సులభంగా పీల్చేందుకు చిటికెన వేలి గోరును ఎక్కువగా పెంచుకుంటారట. సాధారణంగా అందరి శరీర తత్వాలు ఒకే విధంగా ఉండవు. ఈ క్రమంలో అస్తమానం దురదలతో బాధపడే శరీరం కలవారు కూడా ఉంటారు. వారు శరీరంలోని అన్ని భాగాల్లో సులభంగా గోక్కునేందుకు వీలుగా చిటికెన వేలి గోరును పెద్దగా పెంచుకుంటారట.
ఒకప్పుడు చిటికెన వేలిని గోరును పెద్దగా పెంచుకుంటే వారు ఐశ్వర్యవంతులని గుర్తించే వారట. ధనవంతులు మాత్రమే ఒకప్పుడు అలా పెంచుకునే వారట. దాదాపు అన్ని వేళ్లతోనూ ఏదో ఒక పని ఉంటుంది, కానీ చిటికెన వేలితో ఎలాంటి పని ఉండదు కదా అని కొంత మంది భావిస్తారట. అందుకే వారు ఆ గోరును పెద్దగా పెంచుకుంటారట. అసియాలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు తమ వర్గం గొప్పతనాన్ని చాటడం కోసం చిటికెన వేలి గోర్లను పెద్దగా పెంచుకుంటారట. అంతేకాదు, ఇంకా కొందరైతే వాటిని ఆభరణాలు, పూలతో అలంకరిస్తారట. కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కూలీలను, కార్మికులను గుర్తించడం కోసం చిటికెన వేలి గోర్లను పెంచమని ఆదేశించేవారట. అయితే ఈ పద్ధతి ఇప్పుడు ఎక్కడా లేదు.