Dinner : ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజూ వేళకు భోజనం చేయడం లేదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. అయితే ఉదయం, మధ్యాహ్నం కన్నా.. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తేనే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఈ మేరకు అమెరికాకు చెందిన బ్రిగమ్ హాస్పిటల్ పరిశోధకులు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.
సదరు హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు కొంతమందిపై అధ్యయనం చేపట్టారు. 14 రోజుల పాటు 19 మంది యువతను ఈ పరిశోధన కోసం తీసుకున్నారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌కు చెందిన వారు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను తగిన సమయానికి పూర్తి చేశారు. రెండో గ్రూప్ వారు రాత్రి పూట మేల్కొని ఆ సమయంలో ఆహారం తీసుకున్నారు. ఈ క్రమంలో చివరకు వారి బ్లడ్ షుగర్ లెవల్స్ ను పరీక్షించారు.
అయితే రాత్రి పూట మేల్కొని ఉండి ఆలస్యంగా ఆహారం తిన్నవారిలోనే షుగర్ లెవల్స్ పెరిగాయని.. వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరిగాయని గుర్తించారు. అలాంటి వారు బరువు ఎక్కువగా పెరుగుతారని చెప్పారు.
అందువల్ల రాత్రి పూట ఆలస్యంగా డిన్నర్ చేయవద్దని చాలా త్వరగా ఆహారం తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 7 గంటలలోపు డిన్నర్ ముగిస్తే చాలా మంచిదని చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని అంటున్నారు.